– 30 వ తేదికి తుది నివేదిక శ్రీ సిఇసి ఆదేశం
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపుపై పున:పరిశీలన చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మెమో జారీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారులకు జారీ చేసిన ఈ మెమోలో 2022 జనవరి ఆరవ తేది నుండి ఇప్పటి వరకు చేసిన తొలగింపులన్నింటిని పున:పరిశీలన చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 30 వ తేది నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేసి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపాలని తెలిపారు. బిఎల్‌ఓలు 100 శాతం క్షేత్ర పరిశీలన జరపాలని, ఆ తరువాత ఇఆర్‌ఓలు కనీసం వెయ్యి తొలగింపులను పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రతి శాసనసభ నియోజక వర్గంలో కనీసం 500 తొలగింపులను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమిం చాలన్నారు.ప్రతి నియోజకవర్గం లో కనీసం 100 తొలగింపులను జిల్లా కలెక్టర్ లేదా జిల్లా ఎన్నికల అధికారి స్వయంగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పూర్తిచేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక ను సిఇఓ కార్యాలయానికి చేర్చాలని ఆదేశించారు.