– రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల పరిశీలనలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎయిర్‌పోర్టుల తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తున్నామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. పనుల వివరాలను రైల్వే జీఎం, ఇతర ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్లాట్ ఫామ్ 1, 10లలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రూ.715 కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతు న్నాయన్నారు. ఓపెన్ ప్లేస్ అయితే నిర్మాణం మరింత వేగంగా జరిగేదన్నారు. అయినా, రైళ్ల రాకపోకలు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వేగంగా చేస్తున్నారని తెలిపారు. 2025 సంవత్సరం ముగిసే సమయానికి ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపురేఖలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా చర్లపల్లి న్యూ టర్మినల్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్ల అనుసంధానం చేసేలా పనులు జరుగుతున్నాయని చెప్పారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌ను రూ. 350 కోట్లతో ఆధునీకరించామనీ, కాజీపేట రైల్వేష్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగు తున్నాయని చెప్పారు. ఘట్ కేసర్ -యాదాద్రికి వెళ్లే ఎమ్‌ఎమ్‌టీఎస్ లైన్‌ను త్వరలోనే పూర్తిచేస్తామని హామీ నిచ్చారు. కొమురవెల్లిలో కొత్తగా రైల్వేస్టేషన్ నిర్మాణానికి ఈ నెలలో శంకుస్థాపన చేస్తామన్నారు. సికింద్రాబాద్ నుంచి నడుస్తున్న వందేభారత్ రైళ్లు వందశాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయనీ, మరో రెండు ట్రైన్లు అదనంగా కావాలని రైల్వే మంత్రిని కోరామని చెప్పారు.