– దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారతీయ రైల్వేలో గతేడాది ఏప్రిల్ ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు తొమ్మిది నెలల వ్యవధిలో రికార్డు స్థాయిలో మూలధన వ్యయం వినియోగించబడిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. రైల్వే అంతటా డిసెంబర్ వరకు మూలధన వ్యయం 75 శాతం వినియోగంకాగా దక్షిణ మధ్య రైల్వేలో 83 శాతం వరకు ఉపయోగించామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతేడాది ఇదే కాలంతో పోల్చితే మూలధన వ్యయం వినియోగం సుమారు 33 శాతం అధికమని వివరించారు. భారతీయ రైల్వేలు ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు మొత్తం మూలధన వ్యయం (రూ.2.62 లక్షల కోట్ల)లో 75 శాతం అంటే సుమారు రూ.1.95 కోట్ల వినియోగాన్ని నమోదు చేసిందని తెలిపారు. భారతీయ రైల్వేలు 2022, డిసెంబర్‌లో రూ.1.46 కోట్ల వ్యయం వినియోగించబడిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మూలధన వ్యయం వినియోగం గతేడాది ఇదే కాలంతో పోల్చితే సుమారు 33 శాతం ఎక్కువ అని వివరించారు. ఈ పెట్టుబడి నూతన లైన్లు, డబ్లింగ్, గేజ్ మార్పిడి ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం వంటి వివిధ మౌలిక సదుపాయాల కల్పనలో కనిపిస్తుందని తెలిపారు. రైల్వేలో ప్రయాణికుల భద్రత అత్యంత కీలకమనీ, అందుకు సంబంధించిన పనులను అభివృద్ధి చేయడానికి గణనీయంగా ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో డిసెంబర్ వరకు సుమారు 83 శాతం మూలధన వ్యయం వినియోగాన్ని చేసిందని వివరించారు. మొత్తం మూలధన వ్యయ బడ్జెట్ కేటాయింపు రూ.16,599 కోట్లలో డిసెంబర్ వరకు రూ.13,690 కోట్లు అంటే సుమారుగా 83 శాతం వినియోగించామని తెలిపారు. గడిచిన ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ వరకు దక్షిణ మధ్య రైల్వే రూ.5,878 కోట్లు మూలధన వ్యయం చేసిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మూలధన వ్యయం గతేడాది ఇదే కాలంతో పోల్చితే సుమారు 43 శాతం అధికమని వివరించారు.