– అంచనాలు మించి రాబడి
– ఏడాదిలో రూ.14.84 లక్షల కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ : దేశంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అధిక పన్ను విధానాలు ప్రజల పొదుపును దెబ్బతీస్తుండగా.. సర్కార్ ఖజానా మాత్రం నిండిపోతోంది. ప్రభుత్వ అంచనాలకు మించి రికార్డ్ స్థాయిలో పరోక్ష పన్నులు వసూళ్లు కావడమే ఇందుకు నిదర్శనం. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశంలో 14.84 లక్షల కోట్ల పరోక్ష పన్ను వసూళ్లు జరిగాయని సీబీఐసీ చైర్మెన్ సంజరు కుమార్ వెల్లడించారు. ఈ విజయం వృత్తి నైపుణ్యాన్ని ప్రతిబింబించడమే కాకుండా సీబీఐసీ బృందం కృషి, పట్టుదల ఎంతో ఉందన్నారు. సిబ్బంది నిర్విరామ కృషిని గుర్తిస్తున్నామని.. వారికి అభినందనలని అన్నారు.
2023-24లో జీఎస్టీ వసూళ్లు రూ.20.18 లక్షల కోట్లకు చేరి.. నూతన మైలురాయిని నమోదు చేశాయన్నారు. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే 11.7 శాతం వృద్థి చోటు చేసుకుందని సంజరు కుమార్ తెలిపారు. జీఎస్టీ రివైజ్డ్ అంచనాల ప్రకారం.. పరిహారం సెస్ సహా సెంట్రల్ జీఎస్టీ రూ.9.57 లక్షల కోట్లు కాగా, ఎక్సైస్ సుంకం రూ.3.08 లక్షల కోట్లు, కస్టమ్స్ రూ.2.19 లక్షల కోట్లు చొప్పున రాబడి నమోదయ్యిందన్నారు.
ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో రూ.19.45 లక్షల కోట్ల పరోక్ష పన్ను వసూళ్లు జరగొచ్చని అంచనా వేశారు. ఆ లక్ష్యాన్ని మించి వసూళ్లు జరిగాయి. 2023 ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు ఏకంగా రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023-24లో స్థూల పన్ను వసూళ్లు రూ.34.37 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది. దేశీయ వినిమయం, ప్రభుత్వ పెట్టుబడుల వ్యయం పెరగడంతో ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తుందని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.