– గతేడాది 8,232 ఇవిలకు ఆర్డర్
హైదరాబాద్: ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో 17.1 శాతం వృద్థితో రికార్డ్ స్థాయిలో రూ.76.83 కోట్ల నికర లాభాలు సాధించినట్టు తెలిపింది. ఇంతక్రితం ఏడాదిలో రూ.76.83 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2023-24లో మొత్తంగా 8,232 విద్యుత్ వాహనాల ఆర్డర్లను దక్కించుకున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం తమ చేతిలో 10వేల పైబడిన ఈవీ బస్సుల ఆర్డర్ ఉందని వెల్లడించింది. దేశంలో ఏ కంపెనీ ఇంత పెద్ద ఆర్డర్లను కలిగి లేదని తెలిపింది. ఇప్పటి వరకు 1,746 యూనిట్లను డెలివరీ చేసినట్లు వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవెన్యూ 5.8 శాతం పెరిగి రూ.1154.14 కోట్లకు చేరింది. ‘2023-24లో రెవెన్యూ, లాభాల పరంగా బలమైన వృద్థిని సాధించాము. మా తయారీ సామర్థ్యం పెంచుకోవడంపై దృష్టి కొనసాగుతుంది. అదే విధంగా బలమైన ఆర్డర్ బుక్‌ను కలిగి ఉన్నాము. మా నూతన సీతారాంపూర్ యూనిట్‌లో ఫిబ్రవరి 24న పాక్షిక ఉత్పత్తి ప్రారంభమైంది. తొలి బ్యాచ్ బస్సులను డెలివరీ చేశాము.” అని ఓజీఎల్ సీఎండీ కెవి ప్రదీప్ తెలిపారు.