– 3.21 లక్షల మంది అప్లై
– గతేడాది కంటే 838 అధికంగా దరఖాస్తులు
– ఆలస్య రుసుం లేకుండా రేపటి వరకు గడువు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్ (ఎంసెట్)కు రికార్డు స్థాయిలో దరఖాస్తులొచ్చాయి. ఇప్పటి వరకు 3,21,604 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గతేడాది 3,20,766 మంది దరఖాస్తు చేయడం గమనార్హం. అంటే గతేడాది కంటే ప్రస్తుతం 838 దరఖాస్తులు అధికంగా రావడమ గమనార్హం. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల ఆరో తేదీ వరకు ఉన్నది. ఆలస్య రుసుంతో మే ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశమున్నది. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరగడానికి వీలున్నది. ఈ మేరకు ఎప్‌సెట్ కన్వీనర్ బి డీన్‌కుమార్, కోకన్వీనర్ కె విజయకుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి 2,33,517 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 87,819 మంది, ఆ రెండు విభాగాలకూ 268 మంది కలిపి మొత్తం 3,21,604 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. గతేడాది ఇంజినీరింగ్ విభాగానికి 2,05,405 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 1,15,361 మంది కలిపి మొత్తం 3,20,766 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగానికి 28,112 మంది అభ్యర్థులు అధికంగా దరఖాస్తు చేయడం గమనార్హం. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు ఆలస్య రుసుం లేకుండా తుది గడువు ఈనెల ఆరో తేదీ వరకు ఉందని తెలిపారు. మే ఏడు నుంచి 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఎప్‌సెట్ రాతపరీక్షలను నిర్వహిస్తారు. మే ఏడు, ఎనిమిది తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం రాతపరీక్షలను, అదేనెల తొమ్మిది నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలు జరుగుతాయి. ఇతర వివరాల కోసం https://eapcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.