ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో మంచు

Record snow in Florida– 2100 విమాన సర్వీసులు రద్దు
న్యూయార్క్‌: అమెరికాలోని పెన్సకోలా ప్రాంతంలో 5-12 అంగుళాల మేరకు రికార్డు స్థాయిలో మంచు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. అమెరికా దక్షిణ భాగంపై శీతాకాల తుపాను భారీగా కురుస్తున్నది. 1989 తర్వాత ఇదే అత్యధికమని వివరించింది. మంచు తుపాను కారణంగా అమెరికావ్యాప్తంగా 2100 విమాన సర్వీసులు రద్దు చేశామని అధికారులు పేర్కొన్నారు. టెక్సాస్‌, లూసియానా, మిసిసిపి, అలబామా, జార్జియా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 10 అంగుళాల తీవ్రతతో మంచు కురుస్తున్నట్టు వెల్లడించారు. దట్టమైన మంచు కురుస్తుండటంతో న్యూయార్క్‌, జార్జియాలతోపాటు పలు రాష్ట్రాల్లో గవర్నర్లు ఎమర్జెన్సీని ప్రకటించారు. రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. విపరీతమైన చలి కారణంగా టెక్సాస్‌, జార్జియా, మిల్వాకీలలో నలుగురు మరణించినట్టు ఏబీసీ న్యూస్‌ వెల్లడించింది.
లూసియానాలోని న్యూ ఆర్లీన్స్‌ చుట్టూ మంచు తుపాను తీవ్రత అధికంగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశామన్నారు. లూసియానా గవర్నర్‌ జెఫ్‌ లాండ్రీ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దట్టమైన హిమపాతం కారణంగా ప్రజలు అత్యవసరం అయితే తప్ప రోడ్డపైకి రావద్దని సూచించారు. ఆర్కిటిక్‌ వైపు నుంచి వీస్తున్న అతిశీతల వాయువుల వల్ల అమెరికా తూర్పు తీరంపై మంచు దట్టంగా పరుచుకుంటోంది.