నవతెలంగాణ-జైపూర్
సింగరేణి గని కార్మికుల అంగీకారం లేకుండా జీతాలు రికవరీ చేసి వరద బాధితులకు సాయం చేస్తామనడం సరికాదని హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు తిప్పారపు సారయ్య ఘాటుగా స్పందించారు. సోమవారం కార్మికులతో కలిసి ఇందారం-1ఏ గనితో పాటు ఇందారం ఓపన్ కాస్ట్ గని మేనేజర్ నాగన్నకు వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ వరద బాధితుల సహయార్థం సింగరేణి గని కార్మికులకు ఒక రోజు వేతనం రికవరీ చేయాలని నిర్ణయానికి వచ్చిన యాజమాన్యం గుర్తింపు సంఘంతో పాటు మరో కార్మిక సంఘం అభిప్రాయం కోరినట్లు గుర్తు చేశారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన వారిని ఆదుకోవడం కోసం సింగరేణికి సంబంధించిన సీఎస్ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధుల నుండి ససాయం చేయాలని అన్నారు. అంతే కాని కార్మికుల అంగీకారంతో పని లేకుండా కార్మిక సంఘాల అభిప్రాయాలతో కార్మికుల జీతాల నుంచి రికవరీ చేయాలన్న అభిప్రాయాన్ని హెచ్ఎంఎస్ ఖండిస్తోందని తెలిపారు. కార్మికుల సాయం కోరాలనుకున్నప్పుడు గనుల వద్ద విరాళాల బాక్సులు ఏర్పాటు చేసి కార్మికుల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించాలని తెలిపారు. ఈ విషయంలో సింగరేని గుర్తింపు సంఘం స్పందించాల్సిన అవసరముందని, యాజమాన్యం అభిప్రాయం తెలుపకుండా మౌనంగా ఉండటం సరికాదన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘంగా కార్మికుల మనోభావాలకు అనుగుణగా నడుచుకోవాలని ఈ సంధర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా హెచ్ఎంఎస్ కార్యదర్శి అనిల్‌రెడ్డి, కేంద్ర కార్యదర్శి కంబాల నర్సయ్య, పిట్ కార్యదర్శి మేడ పెద్దన్న, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దుర్గం లక్ష్మన్, నాయకులు ఖండే సమ్మన్న, కొట్టె సురేష్, కొల్లూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.