భువనగిరి కోటపై ఎర్ర జెండా ఎగరాలి

 nlg julakanti item– భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్న బీజేపీని.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించండి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-చండూరు
భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీజేపీని పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించాలని, పోరాటాల అడ్డా భువనగిరి కోటపై ఎర్ర జెండా ఎగురవేయాలంటే భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని కోరారు. శుక్రవారం నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో ఆ పార్టీ చండూరు, గట్టుపల మండలాల విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ వెనుకబాటుకు కారణం గత పాలకులేనని తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాలని పాదయాత్రలు చేయడంతో పాటు సాగు, తాగునీరు కోసం పోరాటాలు నిర్వహించడంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఇండ్ల స్థలాల కోసం, కార్మికుల కోసం, గీత కార్మికుల సమస్యల కోసం, పేద ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడింది కమ్యూనిస్టులేనని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనలకు అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చి, ఆ స్థానంలో మనుధర్మాన్ని తీసుకొచ్చి ఫ్యూడల్‌ పద్ధతులు ప్రవేశ పెట్టడం కోసం బీజేపీ కృషి చేస్తోందని, దీని ద్వారా కుల, మత, ప్రాంత విద్వేషాలు సృష్టిస్తోందని అన్నారు. ఇప్పటికే సీఏఏ, పౌరసత్వ రద్దు, జ్యోతిష్యశాస్త్ర అమలు, విద్యా కాషాయీకరణతో పాటు ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను బెదిరించడం, వారిని లొంగదీసుకోవడం, మేధావులను జైళ్లల్లో పెట్టడం లాంటి వాటిని బలవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. నోట్ల రద్దుతో నల్ల డబ్బును బయటికి తీసి దేశ ప్రజల ఖాతాల్లో ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పిన బీజేపీ.. అవినీతికి చట్టబద్ధత కలిగించిందన్నారు. ఎలక్టోరల్‌్‌ బాండ్స్‌ రూపంలో రూ.1600 కోట్ల అవినీతి జరిగితే, దాంట్లో రూ.800 కోట్లు బీజేపీకి చేరాయని తెలిపారు. బాండ్స్‌ చట్ట విరుద్ధమైనవని సీపీఐ(ఎం) పోరాడటంతో.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్ల అవినీతి బయటికి వచ్చిందన్నారు. విద్యా రంగానికి బడ్జెట్‌ తగ్గించి (0.4శాతం) విద్యను పూర్తిగా ప్రయివేటీకరణ చేశారన్నారు. ఆకలి సూచిలో మనదేశం 111 స్థానంలో ఉందన్నారు. లిక్కర్‌ కేసులో బీజేపీకి అరబిందో పార్మా కంపెనీ అధినేత శరత్‌ చంద్రారెడ్డి ద్వారా రూ.60 కోట్ల ముడుపులు ముట్టాయని తెలిపారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ సీపీఐ(ఎం) చేసిన పోరాటాలు తెలుసన్నారు. సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగా పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు సాధించి పెట్టామన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. నిరంతరం నిజాయితీగా, నికరంగా, అవినీతికి తావులేకుండా ప్రజాసమస్యలపై పోరాడే భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థిగా ఎండీ జహంగీర్‌ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, చండూరు మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్‌, గట్టుప్పల్‌ మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్‌, అచ్చిన శ్రీనివాస్‌, పి.శ్రీను, ఖమ్మం రాములు, పెద్దగాని నరసింహ, బి.నరసింహ, బి.యాదయ్య, విశ్వనాథం, అబ్బయ్య, ఈరటి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.