ఉదయ కిరణ బాణాలు
ఒక నిరంకుశత్వాన్ని చీల్చేస్తూ
నిత్య నిర్మల వికాసానికి
వారధిగా నిలబడి గెలిచింది
ఎర్ర జెండా రెపరెపలు
ఒక వినూత్న గేయాలాపనకు
సమసమాజ గీతికగా
నిరంతరం పోరాటం చేసింది
అట్టడుగు నిర్బంధాలతో
ఒక గీత అడ్డంగా వచ్చినప్పుడు
ఎరుపు కండ్ల పరిష్కారపు ఒరవడి
ఉవ్వెత్తున లేచి నిలబడింది
అణగదొక్కే పరిణామపు కోరల్ని
ఎర్రటి కాగడా వెలుగు ఖడ్గం
ఖండించే పనిలో నిమఘ్నమైంది
ఆ ఎర్ర సూరీడు మండుతుంటే
వెక్కిరించే అరచేతుల మధ్యన
పెడబబ్బల గుణపాఠం
ఒక పరిష్కారపు మార్గమైంది
చిన్న చూపుల పరంపరలో
దూరమౌతున్న మానవతకు
బుద్ధి చెప్పే ఉద్యమాల పోరు గడ్డ
ఒక్కసారిగా దండెత్తి కదిలింది
ఎగురుతున్న ఎరుపు పతాకం
కొడవండ్లు చేతబట్టి
కలుపు మొక్కల కొతకై కదులుతూ
సమధర్మ పాలిత ప్రాంతానికై
సమర శంఖం పూరిస్తూ కదిలింది
బడుగు సమర భేరి నినాదంలో
అనచబడే ప్రక్రియకు తిలోదకాలిస్తూ
పగ్గాలను చేతబట్టే చైతన్యానికి
ఊతమిస్తూ ఉరకలేస్తోంది
ఎర్రసూరీడు సాక్షిగా
ఒక ఉద్యమ బాట
ఒక ఉద్ధారణ హోమానికి
ఆజ్యం పోస్తూ బతుకునిస్తోంది
సమాజంలో బతకనిస్తోంది
– నరెద్దుల రాజారెడ్డి, 9666016636