– ఆంక్షలు తొలగించిన కేంద్రం
– వివాదాస్పద నిర్ణయమంటున్న పర్యావరణవేత్తలు
న్యూఢిల్లీ : ఎర్ర చందనం ఎగుమతులపై అమలులో ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఎర్ర చందనం ఎగుమతులకు సంబంధించి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్‌డేంజర్డ్ స్పైసిస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా (సీఐటీఈఎస్) ‘ప్రతికూల’ జాబితా నుంచి భారత్‌ను తొలగించారు. దీనివల్ల ఎర్ర చందనం వ్యాపారంలో రైతులు చట్టబద్ధంగానే ప్రవేశించవచ్చునని, మంచి ఆదాయం పొందవచ్చునని ప్రభుత్వం చెబుతోంది. సీఐటీఈఎస్ నిబంధనలను పాటించడం, దేశీయ చట్టాల్లో సవరణలు చేయడంతో ఈ వెసులుబాటు లభించిందని తెలిపింది. ఎర్ర చందనాన్ని ఫర్నీచర్, హస్తకళలకు సంబంధించిన వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. జౌళి, మందుల తయారీ పరిశ్రమల్లో కూడా దీనిని వాడతారు. గతంలో ఎర్ర చందనం అక్రమ రవాణాపై పలు ఉదంతాలు వెలుగు చూడడంతో సీఐటీఈఎస్ భారత్‌ను ‘ప్రతికూల’ దేశాల జాబితాలో చేర్చింది. గణనీయ వాణిజ్య సమీక్ష (ఆర్‌ఎస్‌టీ) నుంచి తొలగించింది. 2004 నుంచి ఇది కొనసాగుతోంది. నిబంధనలు పాటించని దేశాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఈ జాబితా ద్వారా సీఐటీఈఎస్‌కు దఖలు పడింది. గతంలో మన దేశం కూడా వ్యాపార సస్పెన్షన్‌కు గురైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ఎర్ర చందనం చెట్లను పెంచుతున్నారు. ఇప్పుడు లభించిన వెసులుబాటుతో దాని పెంపకందారులు చట్టబద్ధంగానే వ్యాపారం చేసుకోవచ్చు. ఎర్ర చందనాన్ని ఇప్పటి వరకూ చాలా మంది అక్రమంగానే సాగు చేస్తున్నారు. చెట్లు పెరిగిన తర్వాత వాటిని కొట్టేసి దొంగచాటుగా రవాణా చేస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము ఆర్జిస్తున్నారు. దీనివల్ల సహజ అడవులు అంతరించిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పర్యావరణ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.