బేబీ డమరి సమర్పణలో శ్రీ పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్ర చీర – ది బిగినింగ్’. నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ, ఒక ముఖ్య పాత్ర పోషించారు. డిసెంబర్ 20న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర గ్లింప్స్ రిలీజ్ వేడుకను ప్రసాద్‌ల్యాబ్స్‌లో నిర్వహించారు. దర్శకుడు, నిర్మాత, నటుడు సుమన్‌బాబు మాట్లాడుతూ, ‘యాక్షన్, మదర్ సెంటిమెంట్‌తో ఈ సినిమాను రూపొందించాను. సినిమాలోని 22 పాత్రలతో పాటు ఎర్రచీర కూడా 23వ పాత్ర పోషిస్తుంది. మొత్తం 45 నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటాయి. ఈ కథలో డివోషనల్ టచ్ కూడా ఉంటుంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు. ‘ఈ కథలో మదర్ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమా చూసిన వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. రిలీజైన గ్లింప్స్ అందర్నీ అలరించడం ఆనందంగా ఉంది’ అని హీరోయిన్ కారుణ్య చౌదరి అన్నారు.