ఎర్ర పొద్దు

Not redపడమటి సంధ్యా సమయం
ఎర్రబడుతూ అస్తమిస్తోంది
తిరిగి చైతన్యం పుంజుకుంటూ
ఎర్రపొద్దయి పుట్టడం కోసం..

ఒక ఉద్యమ పిడికిలి బిగిస్తోంది
ఎర్రటి కాగడాలా రగలడం కోసం
ఒక ఎర్రజెండా రెపరెపలాడుతోంది
సమసమాజ హితం కోసం
ఎర్రమట్టిపై ఒక చెట్టు కొమ్మ
ఎరుపు పూలను పోగేసుకుంటోంది
సమన్యాయ పరిమళాలు వెదజల్లుతూ
సగటు బతుకుల భవిత కోసం..
ఒక కొడవలి ఎలుగెత్తి చాటుతోంది
కలుపు కోతలతో కాయనిచ్చే చెట్టును
వ్యవస్థలో బతకనీయడం కోసం
బడుగు వేదన నిరసన కర్రను చేపట్టింది
అట్టడుగు జీవితాల అభ్యున్నతి కోసం
ప్రతి అడుగు కదం తొక్కుతూ కదిలింది
న్యాయ పోరాటపు పటిమ కోసం..

పేదాకలి మరో ప్రభంజనమైంది
నిలువ నీడనివ్వని దౌర్భాగ్యాన్ని
కాలర్‌ పట్టి నిలేసి అడగడం కోసం
వెనుదిరగని ఒక ఉద్యమ కెరటం
అడుగుల్ని పిడుగులుగా మార్చుకుంది
వెనుకబడిన జీవనాల ఊపిరి కోసం..

ఎర్రపొద్దు బాహాటంగా పొడిచింది
ఎరుపు కిరణాల నినాదపు బాటలో
న్యాయాన్ని బతికించడం కోసం
గూడు చెదిరి ఎగిరిపోయిన పక్షుల్ని
గూటికి చేర్చే మహత్తర కార్యం కోసం
ఒక సగటు జీవన చక్రాన్ని
సవ్యంగా నడుపుకోవడం కోసం..
– నరెద్దుల రాజారెడ్డి, 9666016636