‘సింధూరం రక్తచందనం/ బంధూకం సంధ్యారాగం పులిచంపిన లేడి నెత్తురు/ ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాలిక నయనజాలిక/ కలకత్తా కాళిక నాలిక కావాలోరు నవకవనానికి’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అంతా ఎరుపే. ఆ ఎరుపే మార్పుకు సంకేతం. ఎక్కడికకక్కడ సకల దోపిడీదుర్మార్గాలను బద్దలుకొట్టే మార్పు. యావత్ ప్రపంచ మానవాళిని విముక్తిబాట పట్టించే మార్పు. ఆ మార్పే విప్లవం. అది సంభవమే.
విభిన్న వర్గశక్తుల సంఘర్షణలోనుండి జ్వలించే మార్పు. కార్యాకరణ సంబంధంగా చలించే మార్పు. అభావం నుండి అభావంకు జరిగే ప్రకృతి సిద్ధమైన సహజ మార్పు. పరిణామాత్మకం నుండి గుణాత్మకంగా సంభవించే మార్పు. మన భౌతిక ప్రపంచమంతా మార్పుమయం. ఈ మార్పును చైతన్యవంతంగా అమలుపరుచుకుంటూ వ్యక్తిగా, సమిష్టిగా, సమాజపరంగా ముందుకు పోవడమే విప్లవాత్మక మార్పు.
ఇదో శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంతం. దీనిని రూపొందించిన వారు మార్క్స్ – ఎంగెల్స్‌లు. ఓ చిరుపుస్తకంగా మానవాళి చేతికించించారు. అదే కమ్యూనిస్టు ప్రణాళిక. 1848లో ఉద్భవించింది. ఫిబ్రవరి 21న లండన్‌లో ఈ పుస్తకాన్ని ప్రప్రథమంగా ముద్రించి ప్రజల చేతిలో పెట్టారు. ఎప్పుడైతే అక్షరం ముద్రించబడి ప్రజల చేతికి వస్తుందో అది ప్రజల ఆస్తిగా మారిపోతుంది. అందుకే ఫిబ్రవరి 21ని ‘రెడ్‌బుక్స్ డే’గా ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తూ శాస్త్రీయ మార్పుకు దోహదపడే విప్లవ గ్రంథాలను పఠిస్తున్నారు. చర్యకు ప్రతిచర్యలా పెట్టుబడిదారీ సంక్షోభం ముదురుతున్న కొద్దీ ‘రెడ్‌బుక్స్ డే’ ప్రాధాన్యత పెరగడమే కాదు, ఆ పుస్తకాల అధ్యయనం కూడా అనివార్యంగా పెరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థకు విరుగుడు సామ్యవాద వ్యవస్థే తప్ప మరేమీకాదు.
కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకం అతి చిన్నది. కేవలం 23 పేజీలు మాత్రమే. దోపిడీ విశ్వరూపాన్ని – ఓ పెద్ద భూతాన్ని అల్లాఉద్దీన్ చిన్న సీసాలో బంధించినట్టు మార్క్స్ ఏంగెల్స్‌లు ఈ చిన్నపుస్తకంలో బంధించి చూపారు. చదివిన వారికి చదివిన ప్రతిసారీ ఓ కొత్త అర్ధం స్ఫురించి ఉత్సాహపరుస్తుంది. విప్లవకారులకు కరదీపిక అయింది. అసలు అధ్యయన దిశనే మార్చివేసింది. భయంకర దోపిడీని నగంగా ఆవిష్కరించడమే కాదు. ఆ వ్యవస్థను ఎలా మార్చుకోవాలో, మార్చుకోవచ్చో, కడకు ఆ దోపిడీ వ్యవస్థనే సమూలంగా నిర్మూలించి, ఆ స్థానంలో సమసమాజ (సోషలిస్టు) వ్యవస్థను ఎలా ప్రతిష్టించవచ్చో కూడా ఆ పుస్తకం నిరూపిస్తుంది. మస్తిష్కాలకు పదును పెడుతుంది.
అందుకే పుస్తకం చివరన ‘ప్రపంచ కార్మికుల్లా ఏకంకండి, పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అన్న నినాదం ఈ యుగనినాదం అయింది.
ఇప్పటి వరకు నడిచిన చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర అని తిరుగులేని విధంగా ఒక పక్క నిరూపిస్తూనే, మరోపక్క ‘తత్వవేత్తలు అందరూ ఈ ప్రపంచాన్ని పరిపరివిధాలుగా వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు కావాల్సింది దానిని మార్చడం’ అనే కర్తవ్య బోధను నొక్కి చెబుతుంది.
ఇదిగో ఈ ‘మార్పు కర్తవ్యమే’ ‘ఎర్ర’ పుస్తకాలు చదివే ఆవశ్యకతను విప్లవ పాఠకులకు దిక్సూచిని చేసింది. అప్పటినుండి ఆ వెలుగుల్లో ఎక్కడికక్కడ మానవ సమాజ పరిణామాలను అధ్యయనం చేయడం, అన్వయించడం, ఫలితాలను రాబట్టడం, అంతిమంగా శ్రామిక జనావళి తమ సంఘటిత సమరశీల పోరాట శక్తితో విజయాలు సాధించి విముక్తి కావడం ఆధునిక చరిత్రగా పరిణమిస్తున్నది.
మళ్ళీ ఆ పోరాటాలే అక్షర రూపం దాలుస్తూ ఎన్నెన్నో ఉద్యమాలకు, ఎన్నెన్నో పోరాటాలకు పునాదిరాళ్లుగా ప్రేరణగా నిలవడం తెలిసిందే. ఆ పోరాటాల్లో, యుద్ధాల్లో ఎన్నెన్ని త్యాగాలు, బలిదానాలు, జీవితార్పణలు ప్రపంచం చవిచూస్తూనే ఉన్నది.
మార్క్స్ ఆలోచన అయితే లెనిన్ ఆచరణ అన్నట్టు మార్క్సిజం – లెనినిజం విడదీయలేని బంధం అయింది. మార్క్స్ – లెనిన్‌లు యూరప్‌లో పనిచేసినా, మార్క్సిజం – లెనినిజం యావత్ ప్రపంచ మానవాళిని విముక్తి చేసే ఆధునిక విశ్వజనీన సిద్ధాంతం అయింది. గతనెల 21న లెనిన్ శతవర్ధంతి జరిగింది. లెనిన్ రచనలు మళ్లీ మళ్లీ చదవాలని పాఠకులు భావిస్తున్నారు.
‘లెనిన్ లెనిన్ లెనిన్, పదం పాడితే లెనిన్, కదం తొక్కితే లెనిన్, కార్మిక విప్లవం శంఖారావంలో లెనిన్, రైతాంగ పోరాటాల వెల్లువలో లెనిన్, పీడిత జనగుండెల్లో లెనిన్, జాతుల విముక్తి యుద్ధాల్లో లెనిన్’ – ఇలా లెనిన్ జగమంతా పరుచుకున్నాడు. జనం నిండా ఆవహించుకున్నాడు.
అధ్యయనం చేయగానే సరికాదు. అధ్యయనాన్ని ఆచరణతో సమన్వయ పరచడం, తిరిగి అధ్యయనం చేసేలా ఆ ఆచరణను విలువైన గుణపాఠాలతో సశాస్త్రీయంగా పాఠకులకు అందించడం. రానున్న విప్లవాలకు వెలుగుదారి కావడం లెనిన్ (ఎర్ర). పుస్తకాల ప్రత్యేకతగా మారింది. ఆ ఎర్రపుస్తకాల వారసత్వం కొనసాగుతున్నది. మున్ముందు కూడా కొనసాగుతూనే ఉంటుంది.
ముఖ్యంగా దోపిడీని అంతం చేసి శ్రామిక రాజ్యస్థాపన గావించడం ఓ శాస్త్రీయ సత్యం. ఆ శాస్త్రీయ సామ్యవాద విశ్వాసం (చారిత్రక విశ్వాసం) ‘ఎర్ర’ పుస్తక రచనలకు శిరోధార్యమైంది. అంధ విశ్వాసాలకు, అజ్ఞానాలకు, కాకతాళీయాలకు ఆ రచనల్లో తావుండదు. ‘ప్రజలే చరిత్ర నిర్మాతలు’ అన్న సత్యం తెలుసు గనుక ప్రజల పట్ల గల అచంచల విశ్వాసాన్ని ఆ రచయితలు ఎప్పుడూ విడనాడరు. అభ్యుదయం, ప్రగతిశీల మార్పును వారావిధంగానే ఆకాంక్షిస్తారు. ఆశిస్తారు. వారి గుండెల ఊపిరుల్లో నిత్యం ప్రజా ఉద్యమాలు, ప్రజాపోరాటాలు ప్రతిధ్వనిస్తూనే వుంటాయి. సమాజం ఎట్లున్నదో అని పోస్‌మార్టం చేయడానికే పరిమితమై గాక, సమాజం ఎట్టుంటే బావుంటుందో కూడా సూచన ప్రాయంగా చెప్తారు. ఆ మార్పు ఎలా వస్తుందో నర్మగర్భంగా వివరిస్తారు. ప్రజలను అలా చైతన్యవంతంగా తీర్చిదిద్దేందుకు అహరహం పాటుపడతారు. ఇదో ప్రజాసాంస్కృతిక భావజాల సంఘర్షణ. ఎర్ర పుస్తకాలు ఈ పని చేస్తాయి.
యధార్ధం ఏమిటంటే భౌతిక ప్రపంచమంతా పదార్థమే! పదార్థం మినహా మరొకటి లేదు. దానిని తెలుసుకోవడమే భౌతిక జ్ఞానం. అది మనిషికి మాత్రమే సాధ్యం. కళ్లు, ముక్కు, చెవి, నాలుక, చర్మం పంచేంద్రియాల ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటాడు. ఇంద్రియాల ద్వారానే జ్ఞానం లభిస్తుంది (నాలెడ్జ్ కేమ్ ఫ్రం సెన్సెస్). మెదడు దానిని రికార్డు చేస్తుంది. ఆ అనుభవ జ్ఞానమే ఆ మనిషి సొంతం అవుతుంది. ఆ జ్ఞానంతో హేతుబద్దంగా కూడా ఆలోచించగలడు. ఆచరణలో రుజువు పరుచుకోగలడు. ఆ శ్రమే అంతిమంగా జీవిత జ్ఞానం అవుతుంది. ఇంత విస్పష్టంగా మార్క్సిజం – లెనినిజం జ్ఞానాన్ని నిర్వచించగలదు.
‘రాజకీయాలు ఓ శాస్త్రీమూ – కళ’ అని మొట్టమొదటిగా చెప్పినవాడు లెనిన్. భాష అక్షరాలతో లిఖితమవుతుంది. అక్షరానికి శక్తీ వుంటుంది, హృదయమూ వుంటుంది. అందుకే లెనిన్ రచనలు ఏవైనాగాని మేధోపరమైన శాస్త్రంగానూ నిలుస్తాయి. హృదయాను గతమయ్యే భావోద్వేగాలను సశాస్త్రీయంగానే నిలబెడతాయి. స్ఫూర్తివంతంగా మనిషిని నడుపగలుగుతాయి. కనుకనే లెనిన్ సమకాలీన కాలంలో జీవించడమే గొప్ప విషయంగా భావిస్తూ, ఉరికంబం ఎక్కేముందు సైతం లెనిన్ జీవితగాథను చదువుకున్నాడు భగత్‌సింగ్. ‘సామాజిక న్యాయసాధన కోసం తన శక్తినంతా వెచ్చించిన వానిగా, తనను తాను పూర్తిగా త్యాగం చేసుకున్న వ్యక్తిగా లెనిన్‌ను నేను గౌరవిస్తాను. అతని పద్ధతులు ఆదర్శప్రాయమని భావిస్తున్నప్పటికీ ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. అలాంటి మానవులే మానవత్వం యొక్క అంత:సారానికి సంరక్షకులు’ అని ఐన్‌స్టీన్ పేర్కొంటాడు.
మార్క్సిజాన్ని తమ సోవియట్ రష్యా దేశానికి అన్వయించి ప్రప్రధమంగా ఈ పుడమిపై శ్రామిక రాజ్యాన్ని స్థాపించిన మహానేతగా లెనిన్ మనందరికి సుపరిచితుడే.
ఆ విప్లవకాలంలో యుద్ధం జరుగుతున్నది. ‘యూరప్‌లోనూ, రష్యాలోనూ దగాకోరు నాయకులు తమ సైన్యానికి తమ దేశాలను రక్షించుకోమని చెప్తున్నారు. ‘ఏది ఎవరి దేశం? సైనికులు ఏ రకం ప్రజలు?’ అంటూ అప్పుడు లెనిన్ చేసిన విస్పష్ట గంభీర ప్రసంగం ఇప్పటికే ప్రపంచం అంతటా మార్మోగుతూనే వున్నది. ఆ అంతర్జాతీయ శ్రామిక వర్గవాణి పచ్చి అవకాశవాద దోపిడీ యుద్ధ స్వార్థాలను చీల్చిచెండాడుతూనే ఉన్నది.
‘మీరనుకున్నట్టు ఇది మీదేశం కాదు. ఇది మీ యజమానులకు, ధనవంతులకు, చక్రవర్తులకు చెందినది. వారు తమ దోపిడీ లాభాల కోసమే మిమ్మల్ని యుద్ధకీలాల్లో దుమకమని చెబుతున్నారు. ఒకర్ని ఒకరు చంపుకోమని ఆయుధాలిచ్చి బలవంతంగా మిమ్మల్ని తోస్తున్నారు. కాని మీరు రష్యన్లు, జర్మన్లు, ఫ్రెంచివారు, అమెరికన్లు, ఇంగ్లండు కార్మికులు. అన్నింటికంటే ముఖ్యంగా మీరు మనుషులు. అందుకే మీరు యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యం కావాలి. మీరు ఆయుధాలను, నిర్లజ్జగా దోపిడీ చేసే దుర్మార్గులకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టండి’.
నిప్పులు చెరిగే వాక్కులవి. అధ్యయనం – ఆచరణ కలగలిపే సైద్దాంతిక భూమిక నుండే అవి ఉద్భవిస్తాయి. ఈ జమిలి కృషిలో ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా వీరులు ప్రతిఘటిస్తారు. పోరాడతారు. బలహీనులు దిగజారిపోతారు. ద్రోహులు బయటపడిపోతారు అని జ్యూలియస్ ప్యూజిక్ అంటాడు.
ఓ సిద్ధాంత స్వచ్ఛతకు పవిత్రతకు లేదా శాస్త్రీయతకు ఇంతకన్నా వేరే తార్కాణం ఏం ఉంటుంది?
ఈ ప్రపంచాన్ని మార్చాలనుకోవడం అందుకు తగిన విద్యాసముపార్జనను నిరంతరం అధ్యయనం చేయడం, అలాంటి జాజ్ఞాసతో సామాజిక పరివర్తనకు కట్టుబడటం, ఓ సత్యాన్వేషణ కోసం పయనించడం, తగిన రుజువు (హేతువు – కారణం) ఏదీ లేకుండా ఓ ప్రమాణంగా అంగీకరించకపోవడం, అంగీకరించిన దానిని మనస్ఫూర్తిగా స్వీకరించడం, తిరిగి అదే మార్గాన్ని ఆచరిస్తూ బలపరచడం, విమర్శ – ఆత్మ విమర్శనా దృష్టితో ముందుకు సాగడం… ఇవన్నీ భావ విప్లవ సాధనాలు.
ప్రకృతి రహస్యాలను ఛేదించడం, మానవజాతి సాధించిన విజయాలను శాస్త్రీయ దృష్టితో అవగాహన చేసుకోవడం, నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్ధిష్ట అధ్యయనం గావించడం, కార్యక్రమాలకు ఉపక్రమించడం, ఆ క్రమంలో ఎప్పటికప్పుడు నూత్న భావాలు కనిపెట్టడం, భవిష్యత్ పై మరింతగా దృష్టిని సారించి దార్శినికతను కలిగి ఉండడం, అశాస్త్రీయ అజ్ఞాన మతమౌఢ్యాలను నిర్ధ్వందంగా తిరస్కరించడం, మానవాళి విముక్తికి స్వేచ్ఛకు, అంతరాలు అవరోధాలు లేని సమానత్వానికి అగ్ర తాంబూలమివ్వడం, సమరశీల సంఘటిత శ్రామిక వర్గ పోరాటాలకు పట్టం కట్టడం – ఇదంతా భావ విప్లవ అంత:సారంగా ఉంటుంది.
మానవజాతి ఆవిర్భావం నుండి శాస్త్రీయ సామాజిక రంగాల్లో సాధించిన అభివృద్ధికర అంశాలన్నింటినీ భావ విప్లవం ఆలంబనగా చేసుకుంటుంది. అయితే భావ విప్లవంలో ఏ కొద్దిమంది వ్యక్తులో చైతన్యవంతులైనంత మాత్రాన సమాజం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటే పొరపాటే.
అందుకే ఈ భావ విప్లవానికి కచ్చితమైన ప్రాతిపదికగా భౌతికమైన సామాజిక విప్లవం అనివార్యంగా సాగితీరాలి. అదే నిజమైన ప్రజా సాంస్కృతిక విప్లవం. అందులో భాగమే ఈ రెడ్ బుక్స్ డే.
– కె.శాంతారావు, 9959745723