ప్లాస్టిక్‌పై జీఎస్‌టీని తగ్గించండి

– రాష్ట్ర ప్రభుత్వానికి పరిశ్రమల యాజమానుల సంఘం విజ్ఞప్తి
– డిసెంబర్‌ నుంచి ప్రోత్సాహకాలందిస్తాం : జయేష్‌ రంజన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్లాస్టిక్‌పై జీఎస్‌టీని 18శాతం నుంచి 12శాతానికి తగ్గించాలని తెలంగాణ, ఆంధ్రా ప్లాస్టిక్‌ తయారుదారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేషన్‌ రంజన్‌ దృష్టికి ఈ విషయాన్ని ఆ సంఘం ప్రతినిధులు తీసుకెళ్లారు. ఈ విషయంపై ప్రభుత్వం తో చర్చించాలని సూచించారు. ఆగస్టులో హైటెక్స్‌లో జరగనున్న ఎక్స్‌పో కోసం సోమవారం రాత్రి ఐటీసీ కాకతీయలో పరిశ్రమల యజమానులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆల్‌ ఇండియా ప్లాస్టిక్స్‌ మ్యాను ఫ్యాక్చరర్స్‌ అసోసియే షన్‌(ఏఐపీఎంఏ) సౌత్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌రెడ్డి వెన్నమ్‌ మాట్లాడుతూ జీఎస్‌టీ తగ్గించాలని కోరారు. అనేక కారణాల వల్ల ప్లాస్టిక్‌ పరిశ్రమ తీవ్ర ఒత్తిడికి గురవుతన్నదన్నారు. అధిక పోటీ కారణంగా ప్లాస్టిక్‌ పరిశ్రమ చాలా తక్కువ మార్జిన్లతో నడుస్తున్నదని తెలిపారు. ఈ రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని, జీఎస్టీ అధిక రేటు వల్ల పెనుదెబ్బ పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్లాస్టిక్‌ పరిశ్రమ ఆహార ఉత్పత్తుల ప్యాకేజింగ్‌, గహౌపకరణాలు, భోజనం, టిఫిన్‌, పెన్సిల్‌ బాక్సుల వంటి రోజువారీ అవసరాలను అందిస్తున్నదని తెలిపారు. స్పందించిన జయేష్‌రంజన్‌ మాట్లాడుతూ జీఎస్‌టి కౌన్సిల్‌ సభ్యులు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావుతో ఈ విషయాన్ని చర్చిస్తానని హామీనిచ్చారు.