హీరోలు, డైరెక్టర్లూ…రెమ్యూనరేషన్లు తగ్గించుకోండి!

Heroes, directors... reduce remunerations!పుష్ప-2 సినిమా రిలీజ్‌, సంధ్యా థియేటర్‌ ఘటనల అనంతరం సినీ, రాజకీయ రంగంలో, సోషల్‌ మీడియా, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్‌ సంధ్యా థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమా వీక్షించడానికి ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు, రెండు రోజుల ముందే అనుమతి కోసం లెటర్‌ ఇచ్చామని థియేటర్‌ యాజమాన్యం, లెటర్‌ ఇస్తేనే అనుమతి పొందినట్టు కాదని పోలీసులు, బౌన్సర్ల అతి ఉత్సాహమే తొక్కిసలాటకు కారణమని ఇంకొందరు, ఇలా ఎవరికివారు మాట్లాడుతున్నారు తప్ప జరిగిన నష్టం గురించి ఆలోచించడం లేదు. ‘గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగాయి.అప్పుడెప్పుడు హీరోలను బాధ్యులు చేస్తూ కేసులు నమోదు చేయలేదు. అల్లు అర్జున్‌ ఒక వేదికపై సీఎం రేవంత్‌ పేరు మర్చిపోవడమే అతనిపై కేసు నమోదుకు కారణం’ అని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. భారీ బడ్జెట్‌ సినిమాల ఫ్రీ రిలీజ్‌కు, బెనిఫిట్‌ షోలకు, టికెట్‌ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఉండాలంటాడు దిల్‌ రాజు. సినిమా టికెట్‌ ధర అనేది డిమాండ్‌ అండ్‌ సప్లరుని బట్టి ఉంటుంది. బడ్జెట్‌ పెరిగింది. తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నది. సినిమాలు తీసేవాళ్లే సినిమాల గురించి మాట్లాడాలి. టికెట్ల ధరలు పెంచితే ప్రభుత్వానికి 18 శాతం జీఎస్టీ వస్తుందంటారు పవన్‌ కళ్యాణ్‌. ఇలా అనేక చర్చలు జరుగుతున్నాయి. కానీ జరగవలసిన చర్చ జరుగుతున్నదా? తెలుగు సినిమా బడ్జెట్‌ రూ. వందల కోట్లకు ఎందుకు పెరుగుతున్నది? భారీ సెట్టింగ్లు, గ్రాఫిక్స్‌్‌, సృజనాత్మ కత, ప్రయోగాలతో నిర్మించడం వలన సినిమాకు భారీ బడ్జెట్‌ అవసరం పడుతున్నదా?కాదు కదా! తెలుగు సినిమా స్టార్‌ హీరోలకు, డైరెక్టర్లకు చెల్లించే రెమ్యూనరేషన్‌ సినీ నిర్మాణ బడ్జెట్‌లో 40శాతం నుండి 60 వరకు ఉంటున్నది. అసలు చర్చ జరగవలసింది దీనిపైన కదా.
సుమారు రూ.800 కోట్ల బడ్జెట్‌తో తీసిన పుష్ప-2 సినిమాకు హీరో అల్లు అర్జున్‌ రెమ్యూనరేషన్‌ రూ.300 కోట్లు, డైరెక్టర్‌ సుకుమార్‌కు రూ.150 కోట్లు అంట. తెలుగు సినిమా స్టార్‌ హీరోల రెమ్యూనరేషన్లు రూ.45 కోట్ల నుండి 150 కోట్లు, స్టార్‌ డైరెక్టర్ల రెమ్యూ నరేషన్లు రూ.25 కోట్ల నుండి 150 కోట్లు. పవన్‌ కళ్యాణ్‌ గతంలో ప్రకటించినట్టు తను ఒక సినిమాకు సగటున ఇరవై గంటలు పనిచేస్తానని గంటకు రూ.రెండు కోట్లు తీసుకుంటానని వెల్లడించారు. మూడు గంటల నిడివి గల పుష్ప-2 సినిమాకు హీరో అల్లు అర్జున్‌ ఎన్ని గంటలు వర్కౌట్‌ చేశారు? సాధారణంగా రెండు నుండి రెండున్నర గంటల నిడివి ఉండే సినిమాలకు స్టార్‌హీరోలు ఎన్ని గంటలు వర్కౌట్‌ చేస్తున్నారు, ఎంతెంత రెమ్యూనషన్స్‌ పొందుతున్నారో తమ సినీ ప్రేక్షకులకు బహిరంగంగా తెలియజేయాలి. సినిమా కలెక్షన్లు రాబట్టడానికి హీరోలు కాదు కథనం, డైరెక్టర్లే ముఖ్యమని ‘ఈగ’ తో సినిమా తీసిన రాజమౌళి తర్వాత డైరెక్టర్లు తమ రెమినేషన్లు గణనీయంగా పెంచుకుంటూ పోతున్నారు. రెమ్యూనరేషన్‌ తగ్గించుకుంటే సినిమా టికెట్ల ధరలు పెంచే అవసరం ఏమున్నది? ప్రీషోలు, బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపుతో సినీ నిర్మాతకు పెట్టిన పెట్టుబడులకు రిటర్న్స్‌, లాభాలు వస్తాయి. ప్రభుత్వాలకు జీఎస్టీ వసూలు అవుతుంది.మరి సామాన్యుల వినోద ఖర్చుల సంగతేంటి? ఉన్నంతలో పేద, మధ్యతరగతి ప్రజలకు చౌకగా లభించే సినీ వినోదాన్ని ఖరీదైనదిగా మార్చేస్తున్నారు.
ఒకవైపున నేటి సినిమాల్లో వినోదం, సమాజానికి మంచి మెసేజ్‌ ఇచ్చే సినిమాలు తగ్గిపోయాయి. హింస, నేర ఘటనలు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి మూఢనమ్మకాలను పెంపొందించే సినిమాలు తీస్తున్నారు. బెనిఫిట్‌ షోలకు, టికెట్‌ ధరల పెంపునకు అనుమతినిచ్చిన ప్రభుత్వానికి సంధ్య థియేటర్‌ ఘటనలపై బాధ్యత లేదా? రేవతి అనే మహిళ చనిపోతే కానీ, ఆమె కొడుకు శ్రీ తేజ్‌ చావు బతుకుల మధ్య హాస్పిటల్‌లో ఉంటే గాని ప్రభుత్వానికి సోయి రాలేదు. అప్పటికీ ఆ బాలుడిని, కుటుంబాన్ని పరామర్శించిన వారు కూడా లేరు. ఘటనపై రోజురోజుకూ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతుంటంతో ఒక్కొక్కరూ స్పందిస్తూ ముందుకొచ్చారు. కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించే తంతు సాగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ‘ఇకనుండి బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపునకు అనుమతినివ్వం’ అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల ప్రజల్లో మరీ ముఖ్యంగా సినీ ప్రేక్షకుల్లో సానుకూలత వ్యక్తమైంది. దిల్‌ రాజు రంగంలోకి దిగడం, సినీ ప్రముఖుల చేత ముఖ్యమంత్రికి శాలువాతో సత్కారాలు చేయడం, తర్వాత ‘సీన’్‌ మారిపోయింది. నెల తిరక్కుండానే మళ్లీ భారీ బడ్జెట్‌ పేరుతో సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ అయిన రామ్‌చరణ్‌ ‘గేమ్‌ చేంజర్‌’ సినిమాకు అధిక ‘షో’లు వేసుకోవడానికి, టికెట్‌ ధరలు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిపై హైకోర్టు పున:సమీక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో టికెట్‌ ధరలను పెంచుకోవడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఉత్తర్వునిచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 2800 థియేటర్లలో 60 శాతం పైగా సినిమా థియేటర్లను 4 సిండికేటు గ్రూపులు నడిపిస్తున్నాయి. వీరి ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు కలిగిన సినిమాలకే థియేటర్లు దొరుకుతాయి. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ ద్వారా అసలు ధరపై సుమారు 15శాతం చార్జీల ద్వారా లబ్ధి పొందుతున్నది ఈ సిండికేట్‌ గ్రూపే. ఓ.టీ.టీ (ఓవర్‌ ది టాప్‌) ప్లాట్‌ ఫామ్స్‌ ద్వారా స్టార్‌ హీరో – డైరెక్టర్‌ కాంబినేషన్‌లోని సినిమాలు రూ.100 నుండి 150 కోట్లు పొందగలుగుతున్నాయి. భారీ బడ్జెట్‌ సినిమాలు రిలీజ్‌ సందర్భంగా 70, 80శాతం థియేటర్లలో ఒకే ఫిల్మ్‌ను నడిపిస్తున్నారు. ప్రేక్షకులు వారి ఇష్ట ప్రకారం వేరే సినిమాకు వెళ్లే అవకాశమే లేకుండా చేస్తున్నారు. చిన్న సినిమాల నటీనటులు, ప్రొడ్యూసర్స్‌, ప్రొడక్షన్‌ యూనిట్స్‌లోని అనేక విభాగాల సిబ్బంది ఉపాధి లేక, ఉపాధికి ఉన్న సరైన జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. సిండికేట్‌ గ్రూప్‌ వీరి సినిమాలకు ఎక్కువ రెంట్‌ను డిమాండ్‌ చేస్తున్నది. సినిమా థియేటర్ల అసలు ఓనర్లకు లీజు దారులకు మధ్య ఒప్పందం సాధారణంగా టికెట్‌ అమ్మకాలపై 25 శాతం 75శాతం షేరింగ్లతో నడుస్తున్నాయి. పార్కింగ్‌ చార్జీలు, కూల్‌ డ్రింక్స్‌, స్నాక్స్‌పై అధిక చార్జీలు వసూలు చేయడం ద్వారా సినిమా హాల్‌ మెయింటెనెన్స్‌ రాబడుతున్నారు. ఎమ్మార్పీ పై అధిక చార్జీలు వసూలు చేసినా పది రూపాయల విలువ చేసే పాప్కార్న్‌ 150 రూపాయలు వసూలు చేసిన అడిగే నాధుడే లేడు. సినిమాల్లో పనిచేసే సిబ్బందికి మాత్రం కనీస వేతనాలివ్వడం లేదు.సినిమా అంటే హీరో, డైరెక్టర్‌, నిర్మాత, హీరోయిన్‌ అయినా మిగతా నిర్మాణ సిబ్బంది పరిస్థితిఏంటి? వారి శ్రమకు తగిన ఫలితం పొందుతున్నారా? ప్రభుత్వం ఈ వైపు దృష్టి సారించాలి.
– గీట్ల ముకుందరెడ్డి, 9490098857