వేసవి వచ్చిందంటే చెమటకాయల సమస్య మొదలవుతుంది చాలా మందికి. ఇవి చిన్న ఎర్ర పొక్కుల్లా ఉంటాయి. ఈ చెమటకాయలు సాధారణంగా ముఖం, మెడ, వీపు, ఛాతీ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తాయి. వేడిగా, ఉక్కగా ఉండే వాతావరణంలో ఉండే వారికి ఈ సమస్య తప్పనిసరి. ఇది ముందు విపరీతమైన చెమటతో మొదలవుతుంది. చర్మం మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ఈ చెమటని స్కిన్ కింద ట్రాప్ చేస్తాయి. ఆ చెమట చిన్న చిన్న పొక్కులుగా ఏర్పడుతుంది. ఇవి పగిలినప్పుడు మంటగా అనిపిస్తుంది. అందుకే ఈ సమస్యని ప్రిక్లీ హీట్ అని కూడా అంటారు. ఈ చెమటకాయల సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
కాటన్ బట్టలు వేసుకోండి..
శరీరం చల్లగా, గాలి తగిలేలా ఉండడం ముఖ్యం. మీకు కుదిరితే చెమట కాయలు ఉన్న చోట కాసేపు బట్ట తొలగించి డైరెక్ట్‌గా గాలి తగిలేలా చూడండి. చిన్న పిల్లలకి అవసరం అనుకున్న సమయంలోనే వేయండి. మీరు కూడా వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోండి. సింథటిక్ బట్టలు వేసుకోకండి. సమ్మర్ లో తేలిక పాటి రంగుల్లో వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోండి. సింథటిక్ బట్టల్లో గాలి ఆడదు. కాటన్ బట్టలు శరీరానికి గాలి తగిలేటట్లు చూస్తాయి. స్కిన్ పొడిగా ఉంచుకోండి. ఈ వేడి లో స్కిన్ ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోండి. స్నానం అయిన తరవాత వెంటనే టవల్ తో పొడిగా అద్దుకోండి. గట్టిగా తుడవకండి. వెంటనే పౌడర్ చల్లుకుంటే చల్లగా ఉంటుంది.
పెరుగు
పెరుగు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. చల్లని పెరుగుని చెమట కాయల మీద అప్లై చేసి పదిహేను నిమిషాల పాటూ వదిలెయ్యండి. తరవాత చల్లని నీటితో కడిగేసి మెత్తటి బట్టతో అద్దండి. గట్టిగా తుడవకండి. పెరుగులో ఉన్న యాంటీ-బాక్టీరియల్ యాంటీ-ఫంగల్ ప్రాపర్టీస్ ఈ సమస్యకి త్వరగా చెక్ పెడతాయి.
కొబ్బరి నీళ్ళు తీసుకోండి..
బయట ఉన్న వేడికి శరీరంలో నీళ్ళు ఆవిరైపోతాయి కాబట్టి ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం అవసరం. కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, లస్సీ, మజ్జిగ వంటివి తాగుతూ ఉండండి. ఆల్కహాల్‌కీ, ఏరేటెడ్ డ్రింక్స్‌కీ నో చెప్పండి. ఫ్లేవర్డ్ వాటర్ కూడా మీ డైట్‌లో చేర్చుకోవచ్చు.
మంచి ఆహారం…
వేపుళ్ళూ, స్వీట్సూ తగ్గించి సాలడ్స్, ఫ్రూట్స్ తీసుకోండి. తాజా కూరగాయలు, ఇంట్లో వండిన వంటనే తీసుకోండి. పండ్లు ఎక్కువగా తీసుకోండి.