– కొత్తగా తెచ్చిన రుణాలు రూ.17,618 కోట్లు
– వెంటాడుతున్న పాత అప్పుల భారం
– వడ్డీలు సహా కిస్తీల చెల్లింపులకు రూ.25,911 కోట్లు
– రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇదీ…
– గట్టెక్కేందుకు మార్గాలు అన్వేషిస్తున్న సర్కారు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఒకవైపు పదేండ్ల అప్పులు.. వాటికి నెలానెలా కట్టాల్సిన వడ్డీలు.. మరోవైపు ప్రస్తుత అవసరాల కోసం తీసుకొస్తున్న రుణాలు… వెరసి రాష్ట్ర ఖజానా కిందా మీదా అవుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసిన సంగతి విదితమే. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలే ఇప్పుడు తడిసిమోపెడవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ అంటే 2023 డిసెంబర్ నుంచి ఏప్రిల్ 13 వరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్, బడ్జెటేతర రుణాలన్నీ కలిపి రూ.17,618 కోట్ల మేర అప్పులు చేసింది. ఇదే సమయంలో రేవంత్ ప్రభుత్వం గత అప్పులకు సంబంధించిన రీపేమెంట్ల కింద (అసలు, వడ్డీలు కలిపి కిస్తీలు తిరిగి చెల్లింపులు) రూ.25,911 కోట్లను చెల్లించింది. ఆ మేరకు తెలంగాణ ప్రజలపై మోపిన రుణభారాన్ని తగ్గించామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లో తెచ్చిన కొత్త అప్పులు (రూ.17,618 కోట్లు) గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు కూడా సరిపోకపోవటం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు గత 125 రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ సగటున రోజుకు రూ.207 కోట్లు ఖర్చు పెట్టింది. దీన్నిబట్టే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీలు, కిస్తీలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. తద్వారా పదేండ్లలో రాష్ట్ర ఖజానాపై మోయలేనంతగా పెరిగిన రుణభారాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. వీటికి తోడుగా ప్రభుత్వం ప్రజోపయోగమైన నిర్మాణాలకు, పనులకు మరో రూ.5,816 కోట్లను మూలధన వ్యయంగా ఖర్చు చేసింది. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసినట్టుగా ఇప్పుడు అప్పుల జోలికి వెళ్లకుండా నియంత్రణ పాటిస్తున్నామని ఓ అధికారి వ్యాఖ్యానించారు. బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకోవటం ద్వారా ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా సర్దుబాటు విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. మరోవైపు 2023 డిసెంబరు నుంచి ఇప్పటిదాకా నాలుగు నెలల వ్యవధిలో రేవంత్ సర్కార్ రూ.15,968 కోట్ల మేర అప్పులను తీసుకుంటే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి (డిసెంబరు నుంచి ఏప్రిల్ నాటికి) బీఆర్‌ఎస్ సర్కార్ 19,569 కోట్లను, 2021-22లో రూ.26,995 కోట్ల మేర అప్పులను తీసుకోవటం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (2024-25)లో రుణాలకు సంబంధించి రూ.59,625 కోట్లను అంచనా వేసుకోగా, ఇప్పటి వరకూ రూ.2,500 కోట్ల వరకూ రుణాలను తీసుకున్నామని ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి.
పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి…
గతంతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) పెరిగినందున ప్రభుత్వం రుణాలు తీసుకునే పరిధి పెరిగింది. జీఎస్డీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ పరిమితంగానే అప్పులు చేస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసే రీపేమెంట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటూ ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం… తీసుకున్న రుణం కంటే ఎక్కువ కిస్తీలు చెల్లించిందని గణాంకాలు చెబుతున్నాయి. తెచ్చిన అప్పుల కంటే తిరిగి చేసిన చెల్లింపులు ఎక్కువగా ఉండటం ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.