– ఈసారి 2.91 లక్షల దరఖాస్తులు
– గతంకంటే 1,51,314 తక్కువ
– సెప్టెంబర్ 15న రాతపరీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు గడువు బుధవారం అర్ధరాత్రి 12 గంటలతో ముగిసింది. అయితే టెట్‌కు ఆదరణ తగ్గింది. ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు మొగ్గు చూపలేదు. గతసారి కంటే ఈసారి 1,51,314 దరఖాస్తులు తగ్గడమే ఇందుకు నిదర్శనం. ఇంకోవైపు ప్రాథమిక పాఠశాలల్లో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు అనర్హులంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో పేపర్-1కు దరఖాస్తులు తగ్గడానికి కారణంగా ఉన్నది. ఇప్పటికే టెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎక్కువ మంది మళ్లీ దరఖాస్తు చేయలేదు. ఇవన్నీ కారణాలతో ఈసారి దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతేడాది జూన్ 12న నిర్వహించిన టెట్‌కు పేపర్-1కు 3,51,476 మంది, పేపర్-2కు 2,77,893 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ ఏడాది పేపర్-1కు 2,69,557 మంది, పేపర్-2కు 2,08,498 మంది కలిపి 2,91,058 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 టెట్ రాతపరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ఆమె తెలిపారు. ఇతర వివరాలకు https://tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
టెట్ దరఖాస్తుల వివరాలు
టెట్ నిర్వహణ తేదీ దరఖాస్తులు
పేపర్-1 పేపర్-2
2022, జూన్ 12 3,51,476 2,77,893
2023, సెప్టెంబర్ 15 2,69,557 2,08,498