తగ్గనున్న వరి దిగుబడి..

– గత ఎనిమిదేండ్లలో ఇదే తొలిసారి
ముంబై: దేశంలో గత ఎనిమిదేండ్లలో తొలిసారిగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసే 2023-24 పంటకాల సంవత్సరంలో వరి ఉత్పత్తి 123.8 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పడిపోతుందని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే గోధుమ ఉత్పత్తిలో మాత్రం 1.3 శాతం పెరుగుదల కనిపిస్తుందని అంచనా వేసింది. గతేడాది 110.6 మిలియన్‌ టన్నుల గోధుమలు ఉత్పత్తి కాగా.. ఈ ఏడాది 112 మిలియన్‌ టన్నులకు పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. మరోపక్క బియ్యం ఎగుమతులపై ఆంక్షలను కొనసాగించే అవకాశం ఉన్నదని నిపుణులు అంటున్నారు.