తగ్గిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు

తగ్గిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు– 17.81 లక్షల టన్నుల సరఫరా
– 32 శాతం వాటా ఎపిదే..
ముంబయి : భారత సముద్ర అహార ఉత్పత్తుల ఎగుమతుల్లో విలువ పరంగా తగ్గుదల చోటు చేసుకున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌ మెజారిటీ వాటాను కలిగి ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశం నుంచి 7.38 బిలియన్‌ డాలర్ల (రూ.61,565 కోట్లు) ఎగుమతులు జరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇంతక్రితం 2022-23లో 8.0 బిలియన్‌ డాలర్ల (రూ.66,739 కోట్లు) ఎగుమతులు నమోదయ్యియి. మొత్తం ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ 32 శాతం మెజారిటీ వాటా కలిగి ఉంది. ఇదే సమయంలో పరిమాణం పరంగా 17,35,286 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులు ఎగుమతి కాగా.. గడిచిన 2023-24లో 17,81,602 టన్నులకు ఎగుమతులు పెరిగాయి.
సంఖ్యా పరంగా భారత్‌ ఆల్‌టైం రికార్డ్‌ స్థాయిలో 17.81 లక్షల టన్నుల ఎగుమతులు సాధించిందని మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంపిఇడిఎ) ఛైర్మన్‌ డివి స్వామి తెలిపారు. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ మార్కెట్లలో పలు సవాళ్లు నెలకొన్నప్పటికీ మెరుగైన ప్రగతి నమోదయ్యిందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రొజెన్‌ రొయ్యల ఎగుమతులు 4.88 బిలియన్‌ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. మొత్తం ఎగుమతుల్లో పరిమాణం పరంగా వీటి వాటనే 40.19 శాతంగా ఉంది. డాలర్ల విలువ పరంగా ఏకంగా 66.12 శాతం వాటాను కలిగి ఉన్నాయి.