తగ్గిన సీజనల్‌ వ్యాధులు : మంత్రి హరీశ్‌ రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గతంతో పోలిస్తే రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు చాలా వరకు తగ్గాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యాలయంలో ఆయన జిల్లా వైద్యారోగ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మిషన్‌ భగీరథ అమలుతో కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులు దాదాపు తగ్గిపోయాని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా కీటకాల ద్వారా వచ్చే వ్యాధులు చాలా వరకు తగ్గాయనీ, అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయని చెప్పారు. ఆ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మలేరియాను గుర్తించే 8 లక్షల రాపిడ్‌ కిట్లు, డెంగీని గుర్తించే 1.23 లక్షల ఎలిజా కిట్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. 26 ఆస్పత్రుల్లో బ్లడ్‌ కాంపోనెంట్‌ మెషిన్లు సేవలందిస్తు న్నాయని వివరించారు.