శ్రీవిద్య 16 ఏండ్ల అమ్మాయి. పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. మంచి మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకోవాలని కలలు కంటుంది. కానీ పరీక్షల ఒత్తిడితో పాటు, ఈ మధ్య ముఖం మీద మొటిమలతో చాలా ఇబ్బంది పడుతోంది. రోజూ అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంటూ దిగులుపడేది. ”ఎందుకిలా? అందరూ నన్ను చూసి నవ్వుతారు,” అనుకుంటూ ఆమె మరింత ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఒంటరితనంలోకి జారిపోయింది.
తన సమస్యను దాచుకునేందుకు శ్రీవిద్య గాఢమైన మేకప్ వాడేది, కానీ అది సమస్యను మరింత పెంచింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెలో వచ్చిన మార్పులను గమనించి, ”ఇంత ఒత్తిడితో ఎలా బతుకుతావు?” అని అడిగేవారు. కానీ ఆమె స్పందించకుండా తన బాధను మౌనంగా మోసేసేది.
మార్పు ఆరంభం
ఒకరోజు ఆమె తల్లి నా (డా.హిప్నో పద్మా కమలాకర్) దగ్గరికి తీసుకువచ్చింది. నేను శ్రీవిద్యతో మాట్లాడి, ”ఈ మొటిమలు అర్థం చేసుకోలేని సమస్య కాదు. ఇవి హార్మోన్లు, ఒత్తిడితో వచ్చేవి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, నీ చర్మం తిరిగి కాంతివంతంగా మారుతుంది,” అని చెప్పి సహజసిద్ధమైన చిట్కాలు సూచించి, కొన్ని సార్లు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది.
టీనేజ్‌లో మొటిమల సమస్య
టీనేజ్ దశలో ఒత్తిడి కూడా ముఖంపై మొటిమల రూపంలో ప్రభావం చూపుతుంది. ఈ వయసులో విద్య, సంబంధాలు, ఆత్మవిశ్వాసం లాంటి అనేక విషయాలు మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. ఈ ఒత్తిడితో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరిగి, ఇది చర్మంలోని సీబం ఉత్పత్తిని పెంచుతుంది. ఈ అధిక సీబం చర్మ రంధ్రాలు మూసుకుపోయి బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతుంది, తద్వారా మొటిమలు వస్తాయి.
ప్రధాన కారణాలు
1. హార్మోన్ల ప్రభావం: ఆండ్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం.
2. జిడ్డు చర్మం: సీబం ఉత్పత్తి పెరగడం వల్ల.
3. అనారోగ్యకరమైనవి : చెమట, ధూళి, రసాయన ఉత్పత్తుల వాడకం.
4. తినకూడనివి : చిప్స్, బిస్కెట్స్, కూల్‌డ్రింక్స్ వంటివి.
కొద్ది రోజుల్లోనే శ్రీవిద్య ముఖంపై మెరుగులు కనిపించాయి. మొటిమలు తగ్గటమే కాకుండా, ఆమె మానసికంగా కూడా ప్రశాంతంగా అనిపించింది. ”నేను తప్పుగా ఆలోచించాను. ముఖం మీద సమస్యలు ఉన్నాయనే బాధతో ఉండటం కంటే, సంతప్తిగా జీవించటం ముఖ్యమని తెలుసుకున్నా,” అని ఆమె చెప్పింది.
ఒత్తిడిని జయిస్తే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే, ఈ చిట్కాలు పాటిస్తే, మొటిమలు తగ్గడమే కాకుండా మీ చర్మం ఆరోగ్యంగా ఉండి, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
ఒత్తిడిని తగ్గించే చిట్కాలు
ధ్యానం, యోగా: రోజూ 10-15 నిమిషాలు ధ్యానం చేయడం. యోగా ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు.
వ్యాయామం : నడక, జాగింగ్, మెట్లెక్కడం వంటి వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి.
సరైన నిద్ర : రోజుకు 7-8 గంటల నాణ్యమైన నిద్ర అవసరం.
ముఖం శుభ్రం : ముఖాన్ని పదేపదే చేతులతో తాకకుండా ఉండడం. రోజుకు 2-3 సార్లు ముఖం కడగడం. రసాయన ఉత్పత్తులను తగ్గించడం. చర్మానికి న్యాచురల్ స్క్రబ్‌లు వాడడం, మొటిమలని గిల్లకుండా ఉండటం. బెడ్‌షీట్స్, దిండు కవర్లను తరచుగా మార్చడం.
స్క్రీన్ టైమ్ తగ్గించడం : మొబైల్, లాప్‌టాప్ ఉపయోగాన్ని క్రమంగా తగ్గించాలి.
ఆహార నియమాలు : విటమిన్-ఎ ఎక్కువగా ఉండి, ఒత్తిడిని తగ్గించే ఆకుకూరలు, గుడ్లు, క్యారెట్ వంటి ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి. చక్కెర, ఫాస్ట్‌ఫుడ్, కార్బొహైడ్రేట్ ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించాలి.
పాజిటివ్ ఆలోచనలు : జీవితంలో సానుకూల దష్టికోణం కలిగి వుండాలి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మీ సమస్యలు పంచుకోవాలి.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్