ఆర్టీసీలో ముందస్తు రిజర్వేషన్‌ చార్జీలు తగ్గింపు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దూర ప్రాంత ప్రయాణీకులపై కొంతైనా ఆర్థికభారం తగ్గించేందుకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం ఉన్న బస్సుల్లో రిజర్వేషన్‌ చార్జీలను తగ్గించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. 350 కిలోమీటర్ల లోపు ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌ చార్జీని రూ.30 నుంచి రూ.20కి తగ్గించారు. 350 కి.మీ., కంటే ఎక్కువ ప్రయాణిస్తే ముందస్తు రిజర్వేషన్‌ చార్జీని రూ.30గా నిర్ణయించారు. అలాగే సూపర్‌లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ప్రస్తుతం ఉన్న ముందస్తు రిజర్వేషన్‌ చార్జీని రూ.50 నుంచి రూ.30కు తగ్గించారు. ”టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు మంచి స్పందన ఉంది. ప్రతి రోజు సగటున 15 వేల టికెట్లను ప్రయాణికులు రిజర్వేషన్‌ చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. ప్రయాణీకులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.
నేడు టీఎస్‌ఆర్టీసీ మెగా రక్తదాన శిబిరాలు,101 ప్రాంతాల్లో ఏర్పాటు
ప్రతి ఇంట్లోనూ ఓ రక్తదాత ఉండాలనీ, దీనివల్ల ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి పునర్జన్మను ఇచ్చినట్టు అవుతుందని టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 101 ప్రాంతాల్లో మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు, ప్రయాణీకులు, ఆర్టీసీ ఉద్యోగులు ఈ శిబిరాల్లో పాల్గొని, రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని కోరారు. టీఎస్‌ఆర్టీసీ సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుం దన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ శిబిరాలు నిర్వహిస్తారని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎమ్‌జీబీఎస్‌లో జరిగే రక్తదాన శిబిరాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రక్తదానంపై అపోహలు వద్దనీ, 18 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్కులు ఏవరైనా రక్తాన్ని దానంగా ఇవ్వొచ్చని చెప్పారు. డిపో పరిధిలోని ప్రతి విద్యాసంస్థ నుంచి కనీసం 20 నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొని రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ శిబిరాల నిర్వహణకు రెడ్‌క్రాస్‌ సొసైటీతో పాటు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు సహకరిస్తున్నాయని వివరించారు.