కృష్ణానగర్ అంటేనే రంగురంగుల ప్రపంచం.. ఆ ప్రపంచంలో తమకు గుర్తింపు దొరకాలని సినీ ప్రేమికులు, నటన మీద ఇష్టం ఉన్నవారు కృష్ణానగర్ కు వెళ్తుంటారు.. ఒక్క అవకాశం కోసం రోజుల తరబడి ఎదురు చూస్తుంటారు. కొందరు తమ లక్ష్యాన్ని చేరుకుంటే.. మరికొందరు చేరుకోలేరు. అయినా పట్టువదలకుండా ప్రయత్నిస్తుంటారు. ఈ గమనంలో ఎన్నో అవస్థలు పడతారు, ఆకలితో అలమటిస్తారు, అవమానించబడతారు. ఏది ఏమైనా ఎన్ని కష్టాలు ఎదురైనా తమ లక్ష్యాన్ని మాత్రం విస్మరించరు. ఈ నేపథ్యాన్ని కృష్ణానగర్ లోని జీవితాలను కథా వస్తువుగా తీసుకొని, రచయిత రావెళ్ల రవీంద్రబాబు చౌదరి పది కథలతో కృష్ణానగర్ వీధుల్లో కథా సంపుటిని తీసుకువచ్చారు.
కృష్ణానగర్ వీధుల్లోని 10 కథలలో ఏ కథకు ఆ కథనే.. కానీ కొన్ని కథలు తర్వాత కథకు లింక్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. రచయిత రావెళ్ల రవీంద్రబాబు రాసినటువంటి కథలలో మనుషుల భావోద్వేగాలను తెలిపారు. అంతేకాకుండా వివిధ వ్యక్తిత్వాలను కథలలోని పాత్రల ద్వారా చూపించారు. మొదటి కథ వెన్నెల కురిసిన కాలంలో నిత్య పాత్రతో చిత్రసీమలో మహిళా ఆర్టిస్టులు ఎదుర్కునే సమస్యల గురించి ప్రస్తావించారు. ఆర్టిస్ట్ అవుదామని కృష్ణానగర్ కు నిత్య అనే అమ్మాయి వెళ్తుంది. ఆ తర్వాత తను వేష్యగా ఎలా మారింది? ఎందుకు మారిందో చెప్తూనే.. వీర అనే అబ్బాయి నిత్య వేశ్య అని తెలిసినా ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. ప్రేమించడానికి మంచి మనుసుంటే సరిపోతుందని రచయిత వీరా పాత్రతో తెలిపారు. అంతేకాకుండా జీవితాలను నాశనం చేసే వారే కాదు ఈ సమాజంలో జీవితాలను సరిదిద్దే వారు కూడా ఉంటారని చెప్పారు.
రెండో కథ ‘అందమూ.. ప్రేమా’..లో ఓ వ్యక్తి ప్రేమించబడడానికి అందం కీలకపాత్ర పోషిస్తుందని రచయిత రావెళ్ల చెప్తారు. అందమూ.. ప్రేమా కథ ప్రస్తుత కాలం సమాజానికి అద్దం పట్టేలా కనిపిస్తుంది. కృష్ణకాంత్ పార్క్ అంటే గుర్తొచ్చేది ప్రేమ పేరుతో శృoగార క్రీడలు, రాసలీలలు.. కానీ రచయిత కృష్ణకాంత్ పార్క్ కథలో మరో కోణాన్ని చూపించారు. కృష్ణకాంత్ పార్క్ కొందరి జీవితాలలో చీకటిని వెలుగులా మార్చగలదని, అమావాస్యని వెన్నెల చేయగలదని తెలిపారు. అక్రమసంబంధాలు పచ్చని కాపురాలలో మంటలను ఎలా రేపుతున్నాయో.. ఎలా ప్రాణాలు తీస్తున్నాయో లూప్ అనే కథలో రచయిత రవీంద్ర చెపుతారు. అంతేకాకుండా క్యాస్ట్ ఎలా ప్రేమికులను విడగొడుతుందో ఈ కథలోనే మరో కథతో తెలుపుతారు.
‘కృష్ణానగర్ పిల్లర్ నెంబర్ 1550’ కథలో ప్రేమ కోసం వెంపర్లాడుతూ కొందరు తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో రచయిత చెప్తారు. ‘సెకండ్ మ్యారేజ్’ ప్రేమంటే ఏంటో చెప్పే కథ.. యవ్వనంలో చేసే తప్పులు తర్వాత కాలంలో ఎలా శాపంగా మారతాయో ‘తీరం దాటి వెళ్లిపోయాక’ కథ చెప్తుంది. ఒక లక్ష్యంతో కృష్ణానగర్ కు వెళ్లి తర్వాత జల్సాలకు, బెట్టింగ్లకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకున్న పాత్ర గురించి ‘ఉదయాలన్నీ కూలిపోయాక’ కథ తెలియజేస్తుంది. ఇలా ఒక్కో కథ 80 శాతం సమాజానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. కులాలుగా మతాలుగా విభజించబడ్డ సమాజంలో ప్రేమికులు విడిపోవడానికి చిన్న కారణం, చిన్న మాట కూడా సరిపోతుందని ‘లాక్డ్ బై క్యాస్ట్’ కథ చెప్తుంది. లాక్డ్ బై క్యాస్ట్ కథ పాఠకులు చదివేటప్పుడు. చదివే పాఠకులు భగ ప్రేమికులైతే వారి హదయాలు మెలిపడతాయి. బాధాతప్త హదయం కళ్ల ముందు గతాన్నో లేక ఓ ఊహా లోకాన్నో కదిలేలా చేస్తుంది. కృష్ణానగర్ వీధుల్లోని కథలన్నీ దాదాపు విషాదాంతాలే.. సెకండ్ మ్యారేజ్ కథ మాత్రమే విషాదాంతం కాదు.
రావెళ్ల రవీంద్రబాబు చౌదరి రాసినటువంటి ఈ కథలు ప్రస్తుత సమాజానికి ప్రతిబింబాలు.. తనదైన శైలిలో రచయిత కథలు బాగా రాశారు. అయితే కొన్ని కథలలో తెగిపోయిన వాక్యాలు ఉంటాయి. ఒకటి రెండు కథలలో కథ నడిచే విధానం సాధారణ పాఠకుడికి అర్థం కాదు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా అవి ఒక్కోసారి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. రచయిత తొలి పుస్తకం కాబట్టి ఇలాంటి పొరపాట్లు సహజం.. ఏది ఏమైనా నిజ జీవితానికి ప్రతిబింబాలైన కష్ణానగర్ వీధుల్లో కథా సంపుటిలోని కథలు, కథా ప్రేమికులకు నచ్చుతాయి.
– సయ్యద్ ముజాహిద్ అలీ, 7729929807