– ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ వైఫల్యం
– భారత్‌పై ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక
– లేకుంటే 2047 నాటికి సంపన్న దేశంగా ఆవిర్భవించలేదు
– ప్రధాన సమస్యగా నిరుద్యోగం
న్యూఢిల్లీ : ఉపాధి కల్పన కోసం సంస్కరణలు చేపట్టని పక్షంలో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని భారత్ సాధించలేదని ప్రపంచబ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. 2047 నాటికి భారతావనిని సంపన్న దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాలలో చెబుతుంటారు. అప్పటికి భారత్ స్వాతంత్య్రం సాధించి వంద సంవత్సరాలు పూర్తవుతుందని ఆయన గుర్తు చేస్తుంటారు. లక్ష్యసాధనలో చేయూత అందించాలని దేశ ప్రజలను కోరుతుంటారు. అయితే సంస్కరణలు చేపట్టకపోతే ఆ లక్ష్యం కలగానే మిగిలిపోతుందని ప్రపంచబ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త (దక్షిణాసియా) ఫ్రాన్‌జిస్కా ఆన్‌సర్జ్ హెచ్చరించారు.
‘స్థితిస్థాపకత కోసం ఉద్యోగాలు’ పేరిట ప్రపంచబ్యాంక్ మంగళవారం తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. 2010 ప్రాంతంలో ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉద్యోగ వృద్ధి బాగా తక్కువగా ఉన్నదని ఆ నివేదిక తెలిపింది. 2000-2022 మధ్యకాలంలో దేశంలో ఉపాధి నిష్పత్తి నేపాల్ మినహా ఇతర దక్షిణాసియా దేశాల కంటే బాగా వెనుకబడిందని చెప్పింది. ఉపాధి నిష్పత్తి అంటే ఏదైనా ఒక దేశంలో పనిచేసే వయసున్న ప్రజల సంఖ్యతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిని పోల్చడం. మొత్తంమీద 2000-2023 మధ్య ఉపాధి వృద్ధి పనిచేసే వయసున్న ప్రజల సగటు వృద్ధి కంటే బాగా తక్కువగా ఉంది.
దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థ రాబోయే రెండు సంవత్సరాలలో మరే ఇతర ప్రాంతం సాధించని వృద్ధిని సొంతం చేసుకుంటుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. అయితే దాని ఉపాధి నిష్పత్తి మాత్రం తగ్గుతోందని తెలిపింది. అంటే దీనర్థం ఆయా దేశాలు అవసరమైన ఉపాధి అవకాశాలను కల్పించలేకపోతున్నాయన్న మాట. దక్షిణాసియా ప్రాంతం ఈ సంవత్సరం 6 శాతం, వచ్చే సంవత్సరం 6.1 శాతం ఉత్పాదక వృద్ధి సాధిస్తుందని అంచనా. దక్షిణాసియాలో ఉపాధి నిష్పత్తి గత సంవత్సరం 59 శాతంగా ఉంది. ఇతర వర్థమాన దేశాలలో అది 70 శాతంగా ఉండడం గమనార్హం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ నివేదిక ప్రకారం గత సంవత్సరం మన దేశంలో యువతలో నిరుద్యోగ రేటు 45.4 శాతంగా ఉంది. దక్షిణాసియా ప్రాంతంలో మాత్రమే గత రెండు దశాబ్దాలుగా పనిచేసే వయసున్న పురుషుల వాటా పడిపోతోందని ప్రపంచబ్యాంక్ హెచ్చరిం చింది. భారత్ సహా పలు దక్షిణాసియా దేశాలలో మహిళల ఉపాధి రేటు 40 శాతం కంటే తక్కువగా ఉన్నదని, ఇది ప్రపంచంలోనే అతి తక్కువ రేటని ఎత్తిచూపింది. భారత్‌లో ఆర్థికాభివృద్ధి వేగవంతంగా జరుగుతున్నప్పటికీ సరిపడినంత పనిచూపించలేకపోతోందని, నిరుద్యోగం అనేది అక్కడ పెద్ద సమస్యగా తయారైందని తెలిపింది. ‘భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగాన్ని రాజకీయ అంశంగా మార్చాలని ప్రధాని మోడీ వ్యతిరేకులు భావిస్తు న్నారు. ఉద్యోగ కల్పనలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకు నేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఉద్యోగ కల్పన కోసం అనేక ముఖ్యమైన చర్యలు చేపట్టానని ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఉత్పత్తిని పెంచేందుకు సంస్కరణలు తీసు కొచ్చానని, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు మౌలిక సదు పాయాల నిర్మాణంపై పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నానని అంటోంది’ అని ప్రపంచబ్యాంక్ నివేదిక వివరించింది.
అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ సంయుక్తంగా ‘భారత్‌లో ఉపాధి’పై మార్చిలో ఓ నివేదికను విడుదల చేశాయి. భారత్‌లోని మొత్తం నిరుద్యోగ జనాభాలో నిరుద్యోగ యువత 82.9 శాతం ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. సెకండరీ స్థాయి విద్య లేదా ఉన్నత విద్య అభ్యసించిన యువతలో నిరుద్యోగం పెరుగుతోందని వివరించింది. భారత్‌లో 2050 నాటికి మొత్తం జనాభాలో వృద్ధుల సంఖ్య 20 శాతానికి పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి గత సంవత్సరం సెప్టెంబరులో తెలియజేసింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ సమస్య పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, యువతలో నైపుణ్యాన్ని పెంచాలని, వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టెక్నాలజీ, కృత్రిమ మేథ, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన నైపుణ్యాలపై భారత్ దృష్టి సారించాలని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ గత జూన్‌లోనే సలహా ఇచ్చారు.