గత రెండు సంవత్సరాలుగా రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వలన, గత పది నెలలుగా పాలస్తీనా గాజా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ చేస్తున్న దమనకాండలో అనేకమంది మరణించడంతో పాటు, లక్షల సంఖ్యలో పెద్దలు, బాలలు శరణార్థులుగా మారుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమస్యగా వుండడమే కాదు, ఇరుగు పొరుగు దేశాలకు పెనుభారంగా ఉంటుంది. అంతరాలకు, వివక్షతలకు, అనేక రాజకీయ ఆర్థిక సామాజిక సమస్యలకు కారణం అవుతున్నారు. ‘ప్రపంచ శరణార్థుల దినోత్సవం’ సందర్భంగా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం 110 మిలియన్ల మంది శరణార్థులుగా ఉన్నట్లు సమాచారం. ఆపదలో ఉన్న శత్రువుకి కూడా ఆశ్రయం ఇవ్వాలని పెద్దలమాట. అంటే ‘అతిథి దేవోభవ’ అనే ఆర్యోక్తిని మానవత్వం ఉన్న మనందరం పాటించే సామాజిక న్యాయ సూత్రం. అయితే రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ వ్యాప్తంగా ముందుకు వచ్చి, నేటికి మనదేశంతో పాటు అనేక దేశాలు ఎదుర్కుంటున్న సామాజిక సంకటం ‘శరణార్థుల సమస్య’. వీరి సమస్యల పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి 1950 డిసెంబర్ 14వ తేదీన ‘శరణార్థుల ఉన్నతస్థాయి కమిషన్’ (యు.ఎన్. హెచ్.సి.ఆర్) ఏర్పాటు చేసి, పెద్ద దిక్కుగా నిలబడి, రక్షణగా ఉంటూ వారి బాగోగులు చూస్తున్నది. జన్మభూమిలో కొనసాగుతున్న నిరంతరం ఘర్షణలు, యుద్ధ వాతావరణం, ఉగ్రదాడులు, మతపరమైన వేధింపులు, కరువు పరిస్థితులు తదితర కారణాల వల్ల పొట్ట కూటి కోసం పొట్టచేత పట్టుకుని, పక్కదేశాలకు, ఇతర ప్రాంతాలకు పోయే ప్రజలే శరణార్థులు. తమ ఆస్తులేకాదు, అస్తిత్వాన్ని కోల్పోయే బతుకులు వీరివి. మహిళలు, చిన్నారులు అధికంగా ఉంటూ, వీరు పడుతున్న బాధలు, హింసలు చూసి మనసు తరుక్కుపోతుంది.
1960 దశకంలో ఆఫ్రికా దేశాల వలస విముక్తి కారణంగా పెద్ద ఎత్తున ఈ సమస్య ముందుకు వచ్చింది. 2001నాటికి శరణార్థుల సంఖ్య పన్నెండు (12) మిలియన్లు. ఈ కారణంగా ఐక్య రాజ్య సమితి సమావేశమై వీరి సమస్యలు పరిష్కారం కోసం ప్రతీ సంవత్సరం జూన్ 20వ తేదీన ప్రపంచ శరణార్థుల దినోత్సవం జరపాలని నిర్ణయించింది. 1951 నుంచి డెన్మార్క్ దేశం ఈ సమస్య పట్ల చొరవ, సహాకారం అందిస్తే, నేటికి 146 దేశాలు భాగస్వామ్యం అయ్యాయి. ఐక్య రాజ్య సమితి 2011 వరకూ ఈ సమస్యను ఆయా దేశాల వ్యక్తిగత సమస్యగా చూసింది. అంతవరకు ఆశ్రయం ఇస్తున్న దేశాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండేది. రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్, ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారం అందించేవి. అయితే 2011 సిరియా యుద్ధబాధితులతో ఈ సమస్య రెండింతలు అయి, ప్రపంచ దేశాలన్నింటినీ ఆలోచనలో పడేలా చేసింది. ఆ ఆలోచనల ఫలితమే శరణార్థులకు గుర్తింపు, ప్రయాణ పత్రాలు అందించటం, భద్రత, ఉపాధి కల్పించటం, వారి పిల్లలకు చదువు తదితర సౌకర్యాలు కల్పించాలని 1967లో రాసుకున్న ప్రోటోకాల్ అమలు చేయాలనే నిర్ణయం.
2016 సెప్టెంబర్ న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో శరణార్థుల మానవ హక్కులు కాపాడాలని, చిన్నారులకు చదువు అందించాలని, లింగ, లైంగిక పరమైన దాడులు నివారించాలని, ఆశ్రయం కల్పించే దేశాలకు సహాయసహకారాలు అందించాలని నిర్ణయించారు. ‘జెన్ ఫోబియా’ జాతి, వర్ణ వివక్షతో ఎవరినీ తిరస్కరించకుండా, పునరావాసం కల్పించాలనే సంకల్పంతో 2018 నుంచి మరింత స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సోమాలియా, సూడాన్, కాంగో దేశాల నుంచి ఎక్కువగా శరణార్థులు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ప్రస్తుతం పాలస్తీనా, గాజా, ఉక్రెయిన్ దేశాల నుంచి భారీ ఎత్తున శరణార్థులున్నారు. ‘సిరియా’ ప్రపంచ శరణార్థుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. కఠిక దారిద్య్రమే అసలు కారణంగా ఆసియా, ఆఫ్రికా దేశాల నుండి వలసలు పెరుగుతున్నాయి. టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండా ఎక్కువ మందికి ఆశ్రయం ఇస్తున్నారు. దక్షిణ ఆసియాలో లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే దేశంగా భారత్ నిలబడింది. దేశవిభజన సమయంలో, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో, శ్రీలంక ఎల్.టి.టి యుద్ధం సమయంలో భారత్ ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చింది. గొప్పగా చేప్పుకునే అమెరికా, జర్మనీ, ఇటలీ తక్కువగా ఆశ్రయం కల్పిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 68.5 కోట్ల మంది శరణార్థులుగా ఉన్నారు. వీరిలో అధికంగా మహిళలు పిల్లలే. 18 సంవత్సరాల లోపు వారు 22.5 కోట్ల మంది ఉన్నారు. ప్రతీ రెండు సెకండ్లకు ఒకరు శరణార్థిగా, ప్రతిరోజూ 44,500 శరణార్థులుగా మారుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
1991లో సోమాలియాలో అంతర్యుద్ధం కారణంగా 10 లక్షలమంది శరణార్థులుగా మారి కెన్యా, ఇథియోపియా దేశాలకు వలస వెళ్లారు. 2011లో సిరియా నుండి 56 లక్షలు మంది శరణార్థులుగా మారి టర్కీ, లెబనాన్, జోర్డాన్, జర్మనీ దేశాలకు వలసపోయారు. అఫ్ఘనిస్తాన్‌లో తరచూ యుద్ధం, తాలిబన్ల వలన సుమారు 26లక్షల మంది శరణార్థులుగా మారి పాకిస్థాన్, ఇరాన్‌కు; దుర్భిక్ష కారణంగా దక్షిణ సూడాన్ నుంచి 14 లక్షల శరణార్థులు ఉగాండా, ఇథియోపియా దేశాలకు వలస వెళ్ళినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
2017లో మయన్మార్ నుంచి 12 లక్షల రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు, మరో మూడు లక్షల మంది ఇతర ప్రాంతాలకు, భారతదేశంలోకి నలభై వేల మంది శరణార్థులుగా తరలివెళ్లారు. యుద్ధోన్మోదాం, జాతి, మత, కుల ప్రాంతీయ తత్వాలు, పాలకుల పరిపాలన, అణిచివేతలు ప్రధాన కారణాలుగా శతాబ్దాల తరబడి ఈ వలసలు, కాందిశీకులు, శరణార్థుల పంథా కొనసాగుతున్నది. ప్రాచీన రోమన్ కవి ఓవిడ్ ఆగస్టస్ పాలనలో, ప్రసిద్ధి ఫ్రెంచ్ కవి, రచయిత, తత్వవేత్త ‘వోల్టేయర’్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా జర్మనీ దేశం వదిలి అమెరికాలో స్థిరపడ్డారు. ఆనాటి పాలకుల చర్య వలన విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది.
2015 సెప్టెంబర్‌లో టర్కీ సముద్ర ఒడ్డున శవంగా తేలిన ‘అలన్ కుర్దీ’ మూడేళ్ల బాలుడు ఉదంతం చూసి ప్రపంచం చలించిపోయింది. ప్రపంచ శరణార్థులలో 62% పిల్లలే. మహిళల శరణార్థ శిబిరాల్లో ఆహారం కోసం తమ శీలాన్ని తాకట్టుపెట్టే దుస్థితిలో ఉన్నారని, ముఖ్యంగా సిరియా శిబిరాల్లో అధికారులను తాత్కాలిక వివాహం చేసుకుని, ”సెక్సువల్ సర్వీసు” అందిస్తూ బతుకుతున్నారని ‘వాయిస్ ఫ్రం సిరియా’ తెలియజేస్తుంది.
సొంత ఇల్లు, దేశం వదిలి ప్రతీ నిమిషానికి సగటున 20 మంది వలసబాట పడుతున్నారంటే ఆ దేశ పరిస్థితులు ఎంతదారుణంగా ఉన్నాయో గ్రహించాలి. పది లక్షల మందికి ఏ దేశ పౌరసత్వం లేదు. మన దేశంలో తమిళనాడులో కడలూరు సమీపంలోని సుమారు ముప్పై వేల శ్రీలంక తమిళులకు ఏరకమైన పౌరసత్వం లేకపోవడం గమనార్హం. అలాగే అసోంలో పౌరసత్వ సమస్యలున్నాయి. యన్.ఆర్.సి, సి.ఏ.ఏ. అమలు జరిగితే ఇంకా ఎంత మందికి పౌరసత్వం సమస్యలు వస్తాయో వేచి చూడాలి.
అందుచేతనే ఇటీవల మన దేశం శరణార్థుల విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తుంది. శరణార్థుల మూలంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక సమస్యలు ఉత్పన్నమై, జాతి, మత ఘర్షణలకు దారితీస్తున్నాయి. వీరికి విద్య, వైద్య, ఉపాధి ఏ రకమైన సేవలూ అందటం లేదు.
అన్ని దేశాలు, ఐక్య రాజ్య సమితి సీరియస్‌గా ఆలోచనలు చేసి, పరిస్థితిని అదుపులోకి తేవాలి. స్వచ్ఛంద సంస్థలు మరింత సేవలు అందివ్వాలి. మీడియా వీరి సమస్యలను వెలుగులోకి తేవాలి. మత సామరస్యంతో అన్ని దేశాలు మెలగాలి. నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి. శాంతి, చర్చలు ద్వారానే సమస్యలు పరిష్కారం చేసుకోవాలి.
రక్షణకోసం ఒక దేశపు పౌరులు, తప్పని పరిస్థితుల్లో ఇంకో దేశాల్లోకి వలసవెళ్ళడం, వారి ప్రాధమిక హక్కుగా భావించాలని అంతర్జాతీయ న్యాయస్థానం పేర్కొంది. ఆ రకంగా వచ్చిన శరణార్థులను మానవతా దక్పథంతో ఆదరించాలి. రక్షణ చర్యలు చేపట్టాలి. ఈ 2024 సంవత్సరంలో ‘రైజ్ అవేర్నెస్’ థీమ్‌తో జరుపుతున్నారు. కనీస హక్కులు కల్పించి, సాటి మానవులుగా ఆదరించాలి. ఈ సమస్య పరిష్కారానికి అన్ని దేశాలు ఉమ్మడి కృషి చేయాలని ఆశిస్తూ…
– ఐ.ప్రసాదరావు 6305682733