రెగెట్టా సెయిలింగ్‌ చాంపియన్‌ ఏకలవ్య బాతం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రతిష్టాత్మకమైన మాన్‌సూన్‌ రెగట్టా జాతీయ ర్యాంకింగ్‌ సెయిలింగ్‌ చాంపియన్‌ షిప్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఏకలవ్య బాతం అండర్‌-15 ఆప్టిమిస్టిక్‌ బాలుర విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. గోవాకు చెందిన శరణ్య జాదవ్‌, గజ్జి అజరు రజతం, కాంస్యం కోసం పోటీపడుతున్నారు. ఈ టోర్నీలో ఏకలవ్య బాతం శనివారం జరిగిన రెండు రేసుల్లోనూ అగ్రస్ధానం సాధించాడు. దాంతో 11 రేసుల తర్వాత 15 పాయింట్లతో నిలిచి, మరో రేసు మిగిలుండగానే మాన్‌సూన్‌ రెగట్టా ట్రోఫీతో పాటు ఎస్‌హెచ్‌ బాబు మెమోరియల్‌ ట్రోఫీని కూడా గెలుచుకున్నారు. తెలంగాణ సెయిలర్‌ దీక్షిత కొమరవెల్లి 52 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండు పాయింట్ల అంతరాన్ని తగ్గించిన మధ్యప్రదేశ్‌కు చెందిన షాగున్‌ ఝా (55) స్వర్ణ పతక బరిలోకి వచ్చింది. అండర్‌ 19 మిక్స్‌ డ్‌ ఇంటర్నేషనల్‌ క్లాస్‌ విభాగంలో తెలంగాణ జంట ధరణి లావేటి, వడ్ల మహేష్‌ (16 పాయింట్లు) 10, 11వ రేసుల్లో నిరాశ పరిచారు. మధ్యప్రదేశ్‌కు చెందిన నాన్సీ, అనిరాజ్‌ సెంధవ్‌ జంట (18 పాయింట్లు) రెండు పాయింట్ల అంతరాన్ని తగ్గించి రెండో స్థానంలో ఉన్నారు. నాన్సీ చేసిన ఫిర్యాదుతో అంతర్జాతీయ జ్యూరీ 10వ రేసులో ధరణి, మహేష్‌ జంటను అనర్హులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అండర్‌ 19 మిక్స్‌డ్‌ క్లాస్‌, అండర్‌ 15 బాలికల క్లాస్‌లో తెలంగాణ, ఎన్‌ఎస్‌ఎస్‌ మధ్యప్రదేశ్‌ సెయిలర్ల మధ్య ఆఖరి 12వ రేసు ఆదివారం రసవత్తరంగా జరగనుంది. ఈ రేసును సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆర్టి సారిన్‌ జెండా ఊపి ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు బహుమతి ప్రదానోత్సవానికి ఏవీఎస్‌ఎం, వీఎస్‌ఎం అడ్మిరల్‌, చీఫ్‌ ఆఫ్‌ పర్సనల్‌ ఇండియన్‌ నేవీ కష్ణ స్వామినాథన్‌ అధ్యక్షత వహిస్తారు.