‘రెరా’లో రిజిస్టర్‌ అవ్వండి

– మరో మూడు సంస్థలకు నోటీసులు
– చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రియల్‌ ఎస్టేట్‌ యాజమాన్యాలు తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్స్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్‌రెరా)లో తప్పనిసరిగా రిజిస్టర్‌ అవ్వాలని ఆ సంస్థ చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించిన మరో మూడు ప్రాజెక్టులకు సోమవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని తెలిపారు. 15 రోజుల్లో ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందనీ, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. షాద్‌నగర్‌ సమీపంలోని చెరుకుపల్లి, కొందుర్గ్‌లో స్వర్గసీమ శాండిల్‌ ఉడ్‌ ఫార్మ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రాజెక్ట్‌, స్వర్గసీమ సుకేతన పేరుతో నివాస ప్లాట్లు విక్రయించే వెంచర్లు చేపట్టి, రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండా పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టడంపై షోకాజు నోటీసు జారీ చేశామని తెలిపారు. మాదాపూర్‌లోని సాలార్‌ పురియా సత్వా నాలెడ్జ్‌ పార్కులో కార్యాలయాన్ని కలిగి ఉన్న జేఎల్‌ఎల్‌ నిర్మాణ సంస్థ రెరా రిజిస్ట్రేషన్‌ పొందకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనీ, ఆ సంస్థకూ నోటీసులు ఇచ్చామన్నారు. మహేశ్వరం, తుక్కాపూర్‌ గ్రామం, శ్రీనగర్‌ ప్రాంతాల్లో ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ 14 ప్రాంతంలో కాంస్టేల్లా రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు రెరా రిజిస్ట్రేషన్‌ కలిగి ఉండీ, తమ ప్రకటనల్లో ఆ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను చూపకుండా ప్రచారం చేస్తున్నందున వారికి కూడా షోకాజ్‌ నోటీసు ఇచ్చామన్నారు. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ లేదా 8 అంతకు మించి విస్తీర్ణంలో నిర్మించే అపార్ట్‌మెంట్లకు రెరా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. సామాన్యుల కష్టార్జితానికి, వారి సొంత ఇంటి కలలకు ‘రెరా’ భద్రతనిస్తుందని తెలిపారు.