– మండలంలో సాగు 21,600 వేల ఎకరాలు
– క్రాఫ్ బుకింగ్ జరిగింది 3,800 వేల ఎకరాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఖరీఫ్ లో సాగవుతున్న పంటల నమోదు నత్తనడకన సాగుతోంది. క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను ఆన్లైన్ చేయాల్సిన వ్యవసాయ విస్తీర్ణ అధికారులు (ఏఈ వోలు) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా రైతుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఎప్పటికప్పుడు సాగైన పంటల వివరాలను సేకరించడానికి బద్దకిస్తున్నారని, కొందరైతే ఫీల్డ్ కు వెళ్లకుండా ఆఫీసుకు పరిమితమై అక్కడి నుంచే గుడ్డిగా లెక్కలు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి.మండల స్థాయి అధికారి నుంచి కింది స్థాయి ఏఈవోలను సమన్వయం చేసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో క్రాప్ బుకింగ్ ప్రక్రియ నెమ్మదించింది. ఫలితంగా ఖరీఫ్ పంటల నమోదులో మండలం వెనుకబడినట్లుగా తెలుస్తోంది.సాగవుతున్న పంటలకు క్రాప్ బుకింగ్ మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. మండలంలో అధికారుల లెక్కల ప్రకారం వరి15,000 వేల ఎకరాలు, పత్తి 3,500 వేల ఎకరాలు,మిర్చి 2,500 వేల ఎకరాలు, ఇతర పంటలు 600 ఎకరాలు మొత్తం 21,600 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని తెలిసింది.ఇందులో 3,800 ఎక రాల్లో, 18 శాతం మాత్రమే క్రాప్ బుకింగ్ జరిగినట్లుగా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.ఇంకా దాదాపు 17,800 ఎకరాలకు క్రాప్ బుకింగ్ చేయాల్సి ఉంది.
ఆలస్యమైతే ఇబ్బందులు
పంటల వివరాల నమోదును ఎప్పటికప్పుడు చేయడం వలన ప్రభుత్వాని సరైన డేటా అందుతుంది. తద్వారా ఏ రైతు ఏ పంట అమ్ముతున్నాడనేది ప్రభుత్వానికి ముందుగా తెలు స్తుంది. ధాన్యం కొనుగోళ్లలో కూడా అవకతవకలు జరగడానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ క్రాప్ బుకింగ్ చేయడం ఆలస్యం చేస్తే కొనుగోళ్లు దగ్గరికి వచ్చే సమయానికి ఏఈవోలు ఏదో ఒక పంటను నమోదు చేసి చేతులు దులుపుకుంటారు. మండలంలో ఇలాంటి సంఘటనలు గతంలో జరిగి రైతులు ఇబ్బందులు పడిన పరిస్థితులు సైతం ఉన్నాయి. పంటల నమోదుకు ప్రతి ఐదువేల ఎక రాలకు ఒక ఏఈవోను ప్రభుత్వం నియమించింది. వారు వారి పరిధిలో సాగవుతున్న పంటల వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయడానికి ప్రత్యేక యాప్ ఇచ్చింది. ఫీల్డ్లోకి వెళ్లి ఫొటో దిగి అక్కడ సాగవుతున్న పంటలను చూసి నమోదు చేయాలి.ఏఈవోలు ఎంట్రీ చేసిన డేటా సరైందో కాదో తెలుసుకునేందుకు ఏవో,ఏడీ,డీఏవో ఫీల్డ్కు వెళ్లి పరిశీలిస్తారు. అయితే క్షేత్రస్థాయిలో ఇదంతా సక్రమంగా జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.నిబంధనలను పాటించి పనిచేసే వారు మండలంలో కొందరు మాత్రమే ఉన్నట్టుగా రైతులు చెబుతున్నారు..దీనికి తోడు రుణమాఫీ కార్యక్రమం రావడంతో ఏఈవోలు క్రాపు బుకింగ్ పూర్తిగా మరిచిపోయారని తెలుస్తోంది.మండల వ్యవసాయ అధికారులు మాత్రం క్రాప్ బుకింగ్ కు సెప్టెంబర్ వరకు తుది గడువు ఉన్నట్టుగా చెబుతున్నారు.