23 మంది కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్దీకరణ

– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న 23 మంది కాంట్రాక్టు అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం (జీవోనెంబర్‌ 35) ఉత్తర్వులను విడుదల చేశారు. 2016, ఫిబ్రవరి 26న జారీ చేసిన జీవోనెంబర్‌ 16 ప్రకారం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కొందరు కాంట్రాక్టు అధ్యాపకులు గతంలో క్రమబద్ధీకరణ కాలేదని తెలిపారు. వారు మంజూరైన పోస్టుల్లోనే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వారి సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయని గుర్తించామని తెలిపారు. గతంలో వారికి క్రమబద్ధీకరణకు అవసరమైన ధ్రువపత్రాలు అందుబాటులో లేవని పేర్కొన్నారు. ఇప్పుడు వారికి అన్ని పత్రాలూ ఉన్నాయనీ, రెగ్యులరైజ్‌ చేసేందుకు అర్హులని గుర్తించామని తెలిపారు. ఆయా పోస్టులకు సంబంధించి వారి కంటే సీనియర్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. అందుకే వారి సర్వీసులను క్రమబద్ధీకరిస్తున్నామని వివరించారు. 23మంది కాంట్రాక్టు అధ్యాపకు లను క్రమబద్ధీకరణ చేయడం పట్ల తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల సంఘం (టీజీజేఎల్‌ఏ-475) అధ్యక్షులు వి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ హర్షం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొంత మంది అధికారుల సమాచార లోపం, ఇతర కారణాల వల్ల ప్రభుత్వ జూని యర్‌, డిగ్రీ కాలేజీల్లో క్రమబద్ధీకరణ జరగని కాంట్రాక్టు అధ్యాపకులున్నారని పేర్కొన్నారు. వారి సర్వీసులను కూడా క్రమబద్ధీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.