నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులు, అధ్యాపకులు ఎవరూ ఆందోళన చెందొద్దని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల సంఘం (టీజీజేఎల్‌ఏ-475) కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, డిగ్రీ కాలేజీల అధ్యాపకుల సంఘం నాయకులు బొంకూరి ప్రవీణ్, పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకుల సంఘం నాయకులు నవీన్, రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి హైకోర్టు తుది తీర్పు వెల్లడించిందని తెలిపారు. క్రమబద్ధీకరణ అయిన అధ్యాపకులు, ఉద్యోగులను తొలగించొద్దంటూ తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఖాళీల్లో చట్టప్రారం నియమించాలని ఆదేశించిందని వివరించారు. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అడ్వకేట్ జనరల్, తమ తరఫున వాదించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది జీవీఎల్ మూర్తికి ధన్యవాదాలు తెలిపారు.
హైకోర్టు తీర్పు పట్ల హర్షం : టీజేఎల్‌ఏ
రాష్ట్రంలో 24 ఏండ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తూ గతేడాది రెగ్యులరైజ్ అయిన వారికి అనుకూలంగా హైకోర్టు ఇవ్వడం పట్ల తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టీజేఎల్‌ఏ) హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగులు కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. తమ కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడం సబబేననీ, హైకోర్టు అందుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇందుకోసం సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.