నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రిహాబ్ రన్నర్స్ పరుగులు పెడుతూనే ఉన్నారు. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన మారథాన్‌లో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుల్లెల గోపీచంద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ కార్డియాక్ రిహాబ్ స్పెషలిస్ట్ డాక్టర్ మురళీధర్ ఇస్తున్న రిహాబ్‌తో గుండె జబ్బులకు గురైన వారు, శస్త్రచికిత్స చేయించుకున్న వారు సైతం కిలోమీటర్ల మేర పరుగులు పెడుతూ ఔరా అనిపిస్తున్న విషయం విదితమే.
ఒక్కసారి గుండె జబ్బుకు గురైతే పడకకే పరిమితమవుతారనే భావన ఉన్న సమాజానికి రిహాబ్ చేయించుకుని పరుగులు తీస్తున్న వారిని చూస్తే అక్కడే ఆగిపోతున్నారు. ప్రస్తుతం ప్రముఖులు సైతం వారి పరుగులకు ఆకర్షితులవుతున్నారు. తాజాగా సచిన్ ప్రశంసలను అందుకుని మురిసిపోయారు. 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.