అందంగా వున్న స్మార్ట్‌ఫోన్ వైపు గొప్పగా మెచ్చుకొంటున్నట్టుగా చూస్తూ ”నువ్వు చాలా బాగున్నావు” అన్నాను.
”ఏరు, పాత ఫోన్, నీ పక్కన వుండాలంటేనే రోతగా వుంది.” అంది స్మార్ట్ ఫోన్.
”నాకు కాళ్లు ఉంటే నేను నీకు దూరంగా వెళ్లేదాన్ని. అయినా నామీద ఎందుకు అంత అసహ్యం.” అడిగాను.
”నాలో వీడియో కాల్స్ చూసే అవకాశం, వాట్స్ అప్ చూసే అవకాశం ఇంకా చాలా చాలా అంశాలు వున్నాయి. అంతేకాదు చూడటానికి నీవు అసహ్యంగా వున్నావు.” గర్వంగా నాతో అంది స్మార్ట్‌ఫోన్.
”నీవు చెప్పింది నిజమే.” అన్నాను.
”నిన్ను త్వరలో పాత సామాన్లు కొనే అతనికి ఇవ్వబోతున్నట్టు మాట్లాడుకొనడం విన్నాను”
”ఇప్పుడు వారి నిర్ణయం మారింది” అన్నాను.
”ఏరు, పాత సెల్‌ఫోన్, నేను కొత్త టెక్నాలజీతో తయారయ్యాను. పోలికలో మన మధ్య నక్క, నాగలోకానికి ఉన్నంత దూరం వుంది. నీలాంటి వారిని ప్రతి ఒక్కరూ తిరస్కరిస్తారు. యజమాని నిన్ను ఏం చెయ్యాలనుకొంటున్నారు.” అడిగింది స్మార్ట్‌ఫోన్.
”ఈ ఇంటి పనిమనిషి ఎల్లమ్మ అడిగిందట, ఇస్తామని చెప్పారు. ఎల్లమ్మ వాళ్లమ్మకు ఆరోగ్యం బాగోలేదని ఊరెళ్లింది. వచ్చాక ఇస్తారంట.” అన్నాను.
”ఆ ఎల్లమ్మ ఏమీ తెలీని అమాయకురాలు లాగుంది అందుకే నిన్ను అడిగింది”
నెల రోజులు గడిచింది
నేనున్నానన్న సంగతే ఎవరూ పట్టించుకోవడం లేదు. స్మార్ట్ ఫోనుకు ఒక్క క్షణం విశ్రాంతి లేదు. సమయం దొరికినప్పుడంతా ఆ స్మార్ట్‌ఫోన్ గర్వంతో నన్ను కసురుకోవడం, తిట్టడం చేస్తున్నా మౌనంగా చూడసాగాను.
మరికొన్ని రోజులకు పనిమనిషి ఎల్లమ్మ వచ్చింది.
ఇంటి పని పూర్తయ్యాక కుర్చీలో కూర్చొన్న యజమాని దగ్గరకు ఎల్లమ్మ వెళ్లి ”సారూ, నేను మా ఊరెళ్లడానికి ముందు సెల్‌ఫోన్ ఇస్తానన్నారు. పనికి వచ్చి వారం రోజులయింది. ఆ పాత సెల్‌ఫోన్ నాకు..” అంటూ నా వైపు ఆశగా చూడటం గమనించాను.
ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు.
ఇంటి యజమాని స్మార్ట్‌ఫోన్ తీసుకొని పనిమనిషి చేతిలోకి ఇవ్వబోయాడు.
”సారూ నాతో ఆడుకుంటున్నారా.. ఇంత ఖరీదయిన ఫోన్ వద్దండీ.” అంది
”ఎల్లమ్మా, మేం ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ వాడదలచుకోలేదు.” అంది ఇంటి యజమాని భార్య.
”అమ్మగారూ, ఐదవ తరగతి చదివే మీ అబ్బాయి ఈ స్మార్ట్‌ఫోన్ వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు చదువులో వెనక పడ్డాడని మీరే చెప్పారు. నాకూ నాలుగవ తరగతి చదివే కొడుకు వున్నాడు. స్మార్ట్‌ఫోన్ వుంటే వీడియో గేమ్స్ అంటూ దానికి బానిస అవుతాడు. అందువల్ల వాడి ఆరోగ్యం, చదువు దెబ్బ తింటుంది. నాకు ఈ స్మార్ట్‌ఫోన్ వద్దమ్మా.” అంటూ ఎల్లమ్మ స్మార్ట్‌ఫోను తిరస్కరించడం చూసి ఆశ్చర్యపోయాను.
స్మార్ట్‌ఫోన్ నా వైపు చూడలేక కళ్లుమూసుకోవడం గమనించాను.
– ఓట్ర ప్రకాష్ రావు, 09787446026న