రేల పువ్వు

Rela flowerతనువు మీది హరిత వస్త్రం జారిపోయి
రహస్యమేదో బహిర్గతం అయినట్టు
కొమ్మ కొమ్మకు
బొట్టు బొట్టంత బంగారు పూమొగ్గలు

అదేదో పార్టీ జెండా రెప రెపలాడుతున్నట్టు
చెట్టు నిండా విరబూసిన పువ్వు
సీమంతమో
పట్టు వోణీ వస్త్రాలంకరణా మహోత్సవమో
జరుగుతున్నట్టు
పేరంటాళ్ళ లేలేత ఎరుపు గదుమకు
పూసిన గంధం
కవచం తొడిగినట్టు
స్త్రీ లోక పాదాలకు రాసిన
ముత్తయిదు మర్యాద

కనబడని తీగ ఏదో
ఆకాశానికి పాకుతున్నట్టు
చెట్టంతా
గుమ్మడి, బీరపువ్వుల దరహాసం
నేల చూపులు చూసే
అదోరకం తంగేడుపువ్వు
మంగళస్నానానికి సిద్ధమయిన నవ వధువు

ఎల్లో కలర్‌ అభిమాన చిత్రకారుడు
కాన్వాసు మీద గీసిన పాలపుంత
ముట్టుకుంటే బుగ్గలు కందిపోయే
సుకుమారి సోయగం
కొంటె గాలి చిటికెన వేలు తాకగానే
కస్సుమని దునికే ముక్కుమీది కోపం
క్షణాల్లో రాలిపోయే తుమ్మపూల వర్షం

ముచ్చటకో మురిపానికో
కోడిగుడ్డు కూరలా
క్యాలీఫ్లవర్‌ ఫ్రైలా
అమ్మ వండి పెట్టు కమ్మటి వంట కోసమో
అడవికి పోయి
గుత్తులు గుత్తులుగా కోసుకువచ్చిన
తీపి గురుతు

రేల పువ్వు
పిలిస్తే పలికేది
చేయి చాపితే దోసిట్లో వాలేది
పాపిష్టి భూదందా రోగం ముదరక మునుపు.
– గజ్జెల రామకష్ణ, 8977412795