బంధం విలువ

Relationship valueఓ బంధం ఏర్పడటానికి కారణాలు ఎన్నో ఉంటాయి. విడిపోవటానికి కూడా ఉంటాయనుకోండి. కానీ ఓ మనిషికి బతకటానికి డబ్బుతో పాటు మానవ సంబంధాలు కూడా చాలా అవసరం. అయితే కాలానికి అనుగుణంగా మనం మనతో ప్రేమగా ఉన్న వారితో గడిపిన క్షణాలను కూడా వదిలేస్తుంటాం. కొన్ని వృత్తి రిత్యా అవ్వొచ్చు, లేక మాట పట్టింపుల వల్లనో కావచ్చు. కారణం ఏదైనా మౌనంగా, దూరంగా ఉండిపోతున్నాం.
ఊపిరి పోసుకున్న దగ్గరి నుండి ఊపిరి ఆగేదాక అమ్మ అని, నాన్న అని, అక్క.. అన్న అని ఎన్నో బంధాలను పెనవేసుకుంటున్నాం. స్నేహం, ప్రేమ అనే కారణాల వల్ల బిగువగా అనుబంధాలకు అల్లికగా సాగిపోతున్నాం. కానీ ద్వేషం, అపార్థం, కోపం, మోసం, స్వార్థం అనే వాటికి చోటు ఇవ్వటం వల్ల ఎన్నో బంధాలు గతంగానే గతించి పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారి వల్ల మీరు బాధ పడినప్పుడు కూడా వారికి దూరంగా ఉండాల్సి వచ్చిండొచ్చు. అయితే ఇక్కడ మనం ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రేమ లేకుండా ద్వేషం, ద్వేషం రాకుండా అసహ్యం ఏర్పడదు. ప్రేమంటే మానవత్వంలో ఓ భాగం. అందులో మనం పెంచుకొన్న నమ్మకం కూడా బంధాలకు పునాది. అప్యాయత లేనిదే ఏ బంధం మొదలవ్వదు.
ఇలాంటి ఓ అద్భుతమైన భావానికి అహం అనే అడ్డుగోడలు కట్టి సమాధి చేస్తున్నారు. మన జీవితాలు యాంత్రికంగా మారనపుడు ప్రతి పని కుటుంబ సభ్యులపైనే ఆధారపడి చేసుకునే వాళ్లం. అలాగే ఇంత టెక్నాలజీ పెరిగి ఇన్ని మాధ్యమాలు లేని కాలంలో ఆనందాన్ని, బాధని కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యనే ఒకరినొకరు పంచుకునేవారు. వారి నుండి ధైర్యాన్ని, సానుభూతిని, సహాయాన్ని పొందేవారు. దీనివల్ల ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం, అనుబంధం ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది పరిస్థితి. మనుషులతో అవసరం లేకుండానే యంత్రాలతో నూటికి 90 పనులు పూర్తి చేసుకుంటున్నాం. దీని వల్లనే మనుషులతో అనుబంధం బాగా తగ్గిపోయింది.
ఇలాంటి యాంత్రిక జీవితంలో ఎదుటి వారిపై చిన్న కోపం వచ్చినా, లోపం కనిపించినా సంబంధాలను దూరం చేసుకుంటున్నాం. ఎదుటి వారిలో కోపాలు, లోపాలు మనకు నచ్చకపోవచ్చు. వీటి వల్ల వారి నుండి విడిపోయుండొచ్చు. కానీ ఆ లోపాన్ని కూడా ప్రేమతో సరిచేసుకోవచ్చు. ఈ ఆధునిక సమాజంలో ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నాం. మనుషుల మధ్య ఉండే అనుబంధాన్ని బతికించే దివ్య ఔషదం ప్రేమ ఒక్కటే అని గుర్తించలేకపోతున్నాం. ఇది తెలుసుకుంటే ప్రతి ఒక్కరి జీవితం నాలుగు గోడల మధ్య మాత్రమే కాకుండా నలువైపులా అహ్లాదకరంగా ఉంటుంది.
గొడవ పడ్డ సంఘటనలను మనసులో దాచుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలుకోవాలి. మీ అహాన్ని పక్కకు పెట్టేయండి. తిరిగి వారితో ప్రేమగా కలవటానికి మనసుతో ప్రయత్నం చేయాలి. తప్పు ఎవరిదని లెక్కలేసుకోకుండా, బంధాల విలువ లెక్కలోకి తీసుకొని నేడే మీ వారికి చేరువ అవ్వండి. బంధాల విలువ, మనుషుల విలువ మనసుతో అర్థం చేసుకోండి. ఒక్క రక్తసంబంధమో, భార్యా భర్తల అనుబంధంలోనే కాదు స్నేహితులు, ఇరుగు పొరుగు వారి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. మీరు ఇష్టపడిన, ఇష్టపడుతున్న వారిని ఈరోజే మనస్ఫూర్తిగా పలకరించండి. అప్పుడు మీ మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది.