మధ్యప్రదేశ్‌ బరిలోకి మాజీ సీఎంల బంధువులు

Madhya Pradesh Relatives of former CMs– కాంగ్రెస్‌, బీజేపీ నుంచి పది మంది.. ఓటరన్న చేతిలో భవితవ్యం
భోపాల్‌ : యాక్టర్లు తమ బిడ్డల్ని నటులుగా తెరపైకి తీసుకుని రావటానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే ఆయా రంగాల్లో ఉన్న వారు కూడా ఇదే ఫార్ములాను అసుసరిస్తుంటారు. ఇక రాజకీయ నాయకులు కూడా తాము అధికారంలో ఉన్నా..లేకపోయినా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి మరీ సీట్లు తెచ్చుకుంటారు. అయితే వారి భవితవ్యం ఓటరన్న చేతుల్లో ఉంటోంది. కాగా ఈసారి మధ్యప్రదేశ్‌ ఎన్నికల పోరులో 10 మంది మాజీ ముఖ్యమంత్రుల బంధువులు కూడా పోటీ చేస్తున్నారు. ఈ సారి కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల జాబితాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన పేర్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలకు చెందిన పది మంది మాజీ ముఖ్యమంత్రుల బంధువులు తమ అదష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ 10 మంది అభ్యర్థుల్లో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు, ఇద్దరు మేనల్లుళ్లు, ఒకరు సోదరుడు, ఒకరు మనవడు, ఒకరు కోడలు. వీరిలో బీజేపీ నుంచి ఆరుగురు, కాంగ్రెస్‌ నుంచి నలుగురు అభ్యర్థులు ఉన్నారు.
మధ్యప్రదేశ్‌ ఆరో ముఖ్యమంత్రి గోవింద్‌ నారాయణ్‌ సింగ్‌ కుమారుడు ధ్రువ్‌ నారాయణ్‌ సింగ్‌, మనవడు విక్రమ్‌ సింగ్‌ బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ధ్రువ్‌ నారాయణ్‌ సింగ్‌ భోపాల్‌ సెంట్రల్‌ నుంచి, విక్రమ్‌ సింగ్‌ సత్నా జిల్లాలోని రాంపూర్‌-బాఘేలాన్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర పదకొండవ ముఖ్యమంత్రి వీరేంద్ర కుమార్‌ సఖలేచా కుమారుడు ఓం ప్రకాష్‌ సఖలేచా నీముచ్‌ జిల్లా జవాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ఆయన క్యాబినెట్‌ మంత్రిగా కూడా ఉన్నారు. అదేవిధంగా, మధ్యప్రదేశ్‌ 12వ సీఎం సుందర్‌ లాల్‌ పట్వా మేనల్లుడు సురేంద్ర పట్వా రైసెన్‌ జిల్లా భోజ్‌పూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర 22వ ముఖ్యమంత్రి ఉమాభారతి మేనల్లుడు రాహుల్‌ సింగ్‌ లోధి తికమ్‌గఢ్‌ జిల్లాలోని ఖర్గాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. రాష్ట్ర 23వ ముఖ్యమంత్రి బాబు లాల్‌ గౌర్‌ కోడలు కష్ణ గౌర్‌ భోపాల్‌లోని గోవింద్‌పురా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదే సమయంలో, మధ్యప్రదేశ్‌ పదవ ముఖ్యమంత్రి కైలాష్‌ జోషి కుమారుడు దీపక్‌ జోషి కాంగ్రెస్‌ పార్టీ నుంచి దేవాస్‌ జిల్లా ఖటేగావ్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 13వ సీఎం అర్జున్‌ సింగ్‌ కుమారుడు అజరు సింగ్‌ రాహుల్‌ సత్నా జిల్లాలోని చురాహత్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర 20వ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్‌ కుమారుడు జైవర్ధన్‌ సింగ్‌ , సోదరుడు లక్ష్మణ్‌ సింగ్‌ వరుసగా రఘోఘర్‌ అసెంబ్లీ స్థానం , గుణ జిల్లాలోని చచౌరా స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఈ ప్రముఖలు బరిలోకి దిగినా..వారి విజయం లేదా ఓటమి నిర్ణయం తెలియాలంటే డిసెంబర్‌ 3వరకు ఓపికపట్టక తప్పదు.