చెన్నై : తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన 22 మంది మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. తమ ప్రాదేశిక జలాల్లో ప్రవేశించి చేపల వేట జరుపుతున్నారని ఆరోపిస్తూ, శనివారం వీరిని శ్రీలంక అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మత్స్యకారులకు చెందిన రెండు పడవలను కూడా విడుదల చేశామని కంట్రీ బోట్ జాలర్ల సంఘం అధ్యక్షుడు రాయప్పన్ రామేశ్వరంలో విలేకరులకు తెలిపారు. పీఎం స్వనిధి కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్మలా సీతారామన్ శనివారం రామేశ్వరం చేరుకున్నారు. మత్స్యకారులను, వారి పడవలను విడిపించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ శనివారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశామని చెప్పారు.