బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయండి

– గిరిజన సంక్షేమ కార్యదర్శికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు షెడ్యూల్‌ను విడుదల చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకూ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలని కోరారు. ఆ ప్రక్రియను ఈ నెలలో పూర్తి చేసేందుకు ఉత్తర్వులివ్వాలని సూచించారు.