– సాగర్ ఎడమ కాలువకు, ఎస్‌ఎల్‌బీసీ, వరద కాల్వకు నీరు వదలాలి
– మంత్రి ఉత్తమ్‌కు రైతు సంఘం వినతి
– చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్పీ ఎస్‌ఈకి మంత్రి ఆదేశం
నవతెలంగాణ-మిర్యాలగూడ
తాగు, సాగు నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, ఎస్‌ఎల్బీసీ, వరద కాలువకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డికి శుక్రవారం హైదరాబాదులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. రానున్న వేసవి కాలంలో ఉమ్మడి జిల్లాలో తాగునీటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. భూగర్భ జలాలను పెంచేందుకు తక్షణమే చెరువులు, కుంటలు నింపాల్సిన అవసరం ఉందన్నారు. ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని కోరారు. చెరువులు కుంటలు నింపితే ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. స్పందించిన మంత్రి సంబంధిత ఎన్‌ఎస్పీ ఎస్‌ఈకి ఫోన్ చేసి నీటి విడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో సీపీఐ(ఎం) నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, బండ శ్రీశైలం, పారేపల్లి శేఖర్‌రావు ఉన్నారు.