1100 థియేటర్లలో రిలీజ్‌

1100 Released in theatersలెజెండరీ క్రికెటర్‌, శ్రీలంకన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్‌ ‘800’. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహించారు. ముత్తయ్య పాత్రలో ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ ఫేమ్‌ మధుర్‌ మిట్టల్‌, ఆయన భార్య మదిమలర్‌ పాత్రలో హీరోయిన్‌ మహిమా నంబియార్‌ నటించారు. శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కష్ణ ప్రసాద్‌ సమర్పణలో ఈ సినిమా ఈనెల 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో శివలెంక కష్ణ ప్రసాద్‌ సంభాషించారు.
దర్శకుడు శ్రీపతి నాకు బాగా పరిచయం. తాను తెరకెక్కించిన ఈ బయెపిక్‌లో చాలా కమర్షియల్‌ హంగులు ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఇలా ఉంటుందా?, ఇన్ని అవరోధాలు ఎదుర్కొని ఆయన ఈ స్థాయికి చేరుకున్నారా? అని ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా, తెరపై సన్నివేశాలు అలా చూస్తూ ఉండేలా సినిమా ఉంటుంది.
ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, అనిల్‌ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లను కలవడం ఒక పెద్ద అనుభూతి. ప్రతి ఒక్కరూ చాలా డౌన్‌ టు ఎర్త్‌. ఈ జర్నీని మంచి మెమొరబుల్‌గా ఫీల్‌ అవుతున్నారు.
ఇండియాలో సుమారు 1100 థియేటర్లలో దీన్ని విడుదల చేస్తున్నాం. ఎక్కువగా మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌ల మీద దష్టి పెట్టాం. తర్వాత మెల్లగా థియేటర్లు పెంచుతూ వెళ్తాం. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ చేస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో నైజాం సునీల్‌ నారంగ్‌, విశాఖ, ఉత్తరాంధ్ర దిల్‌ రాజు, ఈస్ట్‌ గోదావరి గీతా ఫిలింస్‌, వెస్ట్‌ గోదావరి ఎల్‌.వి.ఆర్‌, కష్ణాజిల్లా అన్నపూర్ణ స్టూడియోస్‌, నెల్లూరు అంజలి పిక్చర్స్‌ భాస్కర్‌ రెడ్డి, సీడెడ్‌ ఎస్‌ సినిమాస్‌, గుంటూరు పద్మాకర్‌ సినిమాస్‌…. ఇలా పేరున్నవారు డిస్ట్రిబ్యూట్‌ చేయడానికి ముందుకు వచ్చారు.
‘యశోద’ను నార్త్‌ ఇండియాలో డిస్ట్రిబ్యూట్‌ చేసిన యుఎఫ్‌ఓ సంస్థ ఈ చిత్రాన్ని కూడా డిస్టిబ్యూట్‌ చేస్తోంది.శ్రీలంకలో కూడా విడుదల చేస్తున్నాం. ముత్తయ్య మురళీధరన్‌ సొంతూరు అది! అక్కడ రిలీజ్‌ వరకు ఆయనే చూస్తున్నారు. ఈ సినిమాను తమిళంలో తీశారు. తెలుగుతో పాటు హిందీలో విడుదల చేస్తే బాగుంటుందని చెప్పాను.
‘800’ దర్శకుడు శ్రీపతి చేయబోయే తదుపరి సినిమా నేనే నిర్మిస్తున్నా. ‘యశోద’ దర్శకులతో ఒక సినిమా ఉంది. ఆల్రెడీ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాం. దర్శకుడు పవన్‌ సాధినేనితో చర్చలు జరుగుతున్నాయి. అతను ఒక మంచి పాయింట్‌ చెప్పాడు. తెలుగులో ‘వదలడు’ పేరుతో విడుదలైన సిద్ధార్థ సినిమా దర్శకుడు సాయి శేఖర్‌ సైతం ఓ కథ చెప్పాడు. నాలుగైదు కథలు రెడీ అవుతున్నాయి.