రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా చేయడానికి అన్ని రకాల జాగ్రత్తలను మేకర్స్ తీసుకుంటున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో రవితేజ లాంచ్ చేశారు. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (సంకేత భాష)లో కూడా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అందులో ఒక యాంకర్ క్లిప్‌లోని కంటెంట్‌ను వివరిస్తున్నారు. భారతదేశంలోనే సైన్ భాషలో విడుదలైన తొలి ట్రైలర్ ఇదే. మిగతా ట్రైలర్స్‌తో పాటు సైన్ లాంగ్వేజ్ ట్రైలర్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయాలని ఈనెల 20న ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో కూడా సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత అభిషేక్ అగర్వాల్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా సైన్ లాంగ్వేజ్‌లో విడుదలైయ్యే మొదటి భారతీయ చిత్రం నిలవడం ఓ విశేషమైతే, భారతీయ సినిమాల్లో ఇదొక స్వాగతించదగిన మార్పుకి దోహదపడటం మరో విశేషం. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈచిత్రాన్ని దసరా కానుకగా ఈ నెల 19న అన్ని దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు.