సందీప్ కిషన్, దర్శకుడు విఐ ఆనంద్ కాంబోలో రూపొందిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాత. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించిన ఈవెంట్‌లో ట్రైలర్‌ని లాంచ్ చేసింది. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, ‘తెలుగు సినిమా ముద్దు బిడ్డ, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు వర్ధంతి నేడు. ఆయన్ని స్మరిస్తూ మా ట్రైలర్‌ని లాంచ్ చేశాం. దర్శకుడు విఐ ఆనంద్ అనుకున్న ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని దాదాపు రెండున్నరేళ్ళు ఈ చిత్రం కోసం ఒక బాధ్యతతో పని చేశాం. ఇందులో ‘నిజమేనే చెబుతున్నా..’ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. దీనికి పూర్తి కారణం ప్రేక్షకుల ఆదరణ. చాలా గొప్పగా ఆదరించారు. ఫిబ్రవరి 9న దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్కు, మంచి హ్యుమర్, పాటలు, బోల్డెంత యాక్షన్ ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. ఊరు పేరు భైరవకోన కమర్షియల్లీ ప్యాకేజ్డ్ ఎంటర్ టైనర్’ అని తెలిపారు. దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ, ‘నా కెరీర్‌లో ఇది ఛాలెజింగ్ ప్రాజెక్ట్. ప్రతి సినిమాతో ప్రేక్షకులు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటాను. ఈ సినిమా ఆడియెన్స్‌కి కొత్త అనుభూతిని, ఎగ్జైట్‌మెంట్‌ని ఇస్తుంది. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ అద్భుతంగా నటించారు. వీరితో పాటు చాలా మంచి స్టార్ కాస్ట్ ఉంది. ఈ చిత్రం ఖచ్చితంగా ఆడియన్స్‌కి సరికొత్త అనుభూతినిస్తుంది’ అని అన్నారు.
‘ఈ చిత్రం ప్రేక్షకులందరినీ అలరిస్తుంది. మంచి ప్రేమకథ, కామెడీ, ఫాంటసీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం’ అని నిర్మాత రాజేష్ దండా అన్నారు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు విఐ ఆనంద్‌కి ధన్యవాదాలు. సందీప్ కిషన్ అమెజింగ్ కోస్టార్. గ్రేట్ ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడకుండా సినిమాని చాలా గొప్పగా నిర్మించారు. శేఖర్ చంద్ర చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. ‘నిజమేనే చెబుతున్న..’ పాటకు చాలా అద్భుతమైన రీచ్ వచ్చింది’ అని తెలిపారు. ‘ఈ చిత్రంలోని రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఇంకా అద్భుతంగా అనిపించింది. ఈ చిత్రం ప్రేక్షకులకు రోలర్ కోస్టర్ రైడ్‌లాంటి అనుభూతిని అందిస్తుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్‌ని ఇస్తుంది’ అని మరో హీరోయిన్ కావ్య థాపర్ చెప్పారు.