– హక్కుల సాధన దిశగా ప్రజాప్రభుత్వ కార్యాచరణ
– తయారీ యూనిట్‌గా అప్‌గ్రేడ్ అయిన కాజీపేట ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు
– సాకారమవుతున్న కాజీపేట రైల్వే డివిజన్
– ఇప్పటికే టెక్నికల్ సెంటర్, మామునూరు ఎయిర్ పోర్టులతో ఇనుమడించిన వరంగల్ ఖ్యాతి : మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఒక్కో హామీని పోరాడి సాధించుకుంటున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కాంగ్రెస్ పోరాట ఫలితంగానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో భాగంగా తయారీ యూనిట్‌ను కేంద్రం మంజూరు చేసిందని పేర్కొన్నారు. గురువారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కాజీపేట రైల్వేస్టేషన్‌కు డివిజన్ హోదాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించడం యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. మానుఫాక్చరింగ్ యూనిట్, రైల్వే డివిజన్ లతో ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోవడానికి జవసత్వాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సంకల్పంతో విభజన చట్టంలోని మిగతా హామీల అమలుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓరుగల్లు ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్ పోర్టును సాకారం చేసుకోవడం అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయమని పేర్కొన్నారు. ఖిలా వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న టెక్నికల్ సెంటర్, ఎంజీఎండీ అడిక్షన్ సెంటర్ ఓరుగల్లు ఖ్యాతిని ఇనుమడింపజేశాయని తెలిపారు. 2041 మాస్టర్ ప్లాన్ లో భాగంగా వరంగల్ సమగ్రాభివృద్ధికి మంజూరు చేసిన రూ. 4,962.47 కోట్లతో అమలు చేస్తున్న ప్రణాళికలు ఓరుగల్లు నగర రూపురేఖల్ని మార్చుతాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ నగరం ఆవిర్భవించే రోజు మరెంతో దూరంలో లేదని స్పష్టం చేశారు.