రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌ అడ్డాగా మోసాలు

Reliance Digital Store Addaga Scams– టార్గెట్ల కోసం కొందరు ఉద్యోగుల అడ్డదారులు
– బ్రోకర్లతో కుమ్మక్కు
– వస్తువులకు బదులు నగదు ఇస్తామంటూ ఘరానా మోసాలు
– ఒకరిద్దరికి డబ్బులు వేసి నమ్మిస్తున్న వైనం
– చైన్‌ సిస్టమ్‌గా కొనసాగుతున్న వ్యవహారం
– వందల సంఖ్యలో బాధితులు.. రూ.లక్షలు వసూళ్లు
– ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించిన పలువురు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగరంలో ‘రిలయన్స్‌ డిజిటల్‌’ అడ్డాగా మోసాలకు పాల్పడుతున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. రిలయన్స్‌ డిజిటల్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు.. బ్రోకర్లు కుమ్మక్కై ఆరేడు నెలల నుంచి దందాను కొనసాగిస్తున్నారు. సైబర్‌ నేరస్థుల తరహాల్లో అందినకాడికి దండుకున్నారు. అత్యాశ చూపించి బాధితులను బోల్తా కొట్టిస్తున్నారు. చైన్‌ సిస్టంలా సాగిన ఈ మోసంలో నగరంతోపాటు శివారు ప్రాంతాలు, ఇతర జిల్లాలకు చెందిన జనాన్ని నమ్మించి లక్షలు దండుకున్నారు. మోసపోయినట్టు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఇలా గాలం వేశారు..
దేశ విదేశాల్లో రిలయన్స్‌ డిజిటల్‌ షాపింగ్‌ స్టోర్లకు మంచి పేరుంది. ల్యాప్‌టాప్స్‌, ఫ్రిజ్‌లు, ఐ ఫోన్లు, వాషింగ్‌ మిషన్లు, ఏసీలు, సౌండ్‌ సిస్టమ్స్‌తోపాటు ఇంట్లోకి కావాల్సిన అన్ని రకాల ఎక్ట్రానిక్‌ వస్తువులు లభిస్తాయి. నగర వ్యాప్తంగా బ్రాంచ్‌లు కూడా ఉన్నాయి. ఉప్పల్‌లోనూ రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌ ఉంది. అయితే ఇందులో పనిచేసే కొందరు ఉద్యోగులు టార్గెట్‌ పూర్తిచేయడంతోపాటు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఒక్కరిద్దరు బ్రోకర్లతో కుమ్మక్కయ్యారు. రిలయన్స్‌ డిజిటల్‌లో వస్తువులు కొనుగోలు చేస్తే వాటిని తామే తిరిగి తీసుకుని అంతే డబ్బులు చెల్లిస్తామని స్నేహితులు, తెలిసిన వారిని నమ్మించారు. వస్తువు కొనుగోలుకు సంబంధించి వడ్డీ లేకుండా ఈఎమ్‌ఐ కట్టుకోవచ్చని చెబుతారు. గుట్టుచప్పుడు కాకుండా ఒక చైన్‌ సిస్టంలా వ్యవహారాన్ని నడిపించారు. అంతేకాకుండా స్టోర్‌లో ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఏసీ ఇలా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేవారిని టార్గెట్‌ చేసేవారు. వారితో మాట్లాడి మీ సిబిల్‌ చెక్‌ చేస్తామని నమ్మించేవారు. సిబిల్‌ చెక్‌ చేసిన తర్వాత మీ సిబిల్‌ స్కోర్‌ బాగుంది, వస్తువుతోపాటు డబ్బులు సైతం తీసుకోండి, వడ్డీ లేకుండా డబ్బులు ఈఎంఐలో చెల్లించొచ్చని నమ్మించేవారు. ఇలా ఒక్కరిని.. వారిద్వారా మరికొంత మందిని చైన్‌ సిస్టంలా కట్టించుకున్నారు. వచ్చిన వారి నుంచి ఆధార్‌, పాన్‌ కార్డు, బ్యాంక్‌ చెక్కు.. ఇలా అన్ని డాక్యుమెంట్లు తీసుకుని స్టోర్‌లోనే ప్రాసెస్‌ చేసేవారు.
ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు
నగరంతోపాటు శివారు ప్రాంతాలు, సిద్దిపేట్‌ జిల్లాలో సైతం బాధితులకు గాలం వేశారు. ఉప్పల్‌లోని స్టోర్‌కు రప్పించి డాక్యుమెంట్లు తీసుకుని వారి సిబిల్‌ చెక్‌చేసి వస్తువులు ఇప్పించేవారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఇందులో మోసం లేదు, తమకు టార్గెట్స్‌ ఉంటాయి. అందుకే ఇలా చేస్తామని నమ్మించేవారు. కస్టమర్‌ను ఆకర్షించి వారితో వస్తువులు కొనుగోలు చేయించేవారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు వస్తువులు కొనుగోలు చేయించేవారు. వాటికి రిసిప్ట్‌ సైతం ఇచ్చేవారు. స్టోర్‌ నుంచి ఆ వస్తువులను మరో ఆటోల్లో తీసుకెళ్లే వారని తెలిసింది. వస్తువు వస్తుందని ఫోన్‌లో చెప్పి ఓటీపీని తెలుసుకునే వారు. ఆ తర్వాత తీసుకెళ్లిన వస్తువులను కస్టమర్లకు తెలియకుండానే మార్గమధ్యలోనే మాయం చేసేవారు. ముందుగా వచ్చిన కస్టమర్లకు పూర్తిగా నమ్మకం కలిగేందుకు వారికి నాలుగైదు రోజుల్లోనే డబ్బులు చెల్లించేవారు. కొనుగోలుదారులు సైతం వారికి డబ్బులు వచ్చాయని మరికొంత మందిని స్టోర్‌కు తీసుకొచ్చేవారు. అలా వచ్చిన వారికి మాత్రం 10రోజులు గడువు విధిస్తున్న నిందితులు.. ముందు గా రూ.10 నుంచి 20వేలు మాత్రమే చెల్లించేవారని తెలిసింది. ఆ తర్వాత వివిధ కారణాలు చెప్పి వాయిదాలు వేస్తున్నారు. ఇలా వందలాది మంది బాధితులను మోసం చేసిన నిందితులు రూ. లక్షలు దండుకున్నారు. తీరా మోసపోయినట్టు గుర్తించిన బాధితులు ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించారు. స్టోర్‌లో పనిచేస్తున్న సాగర్‌, జ్యోతి తమను నమ్మించి మోసం చేశారని ఫిర్యాదు చేశారు. వారు సంస్థకు చెందిన ఐడీ కార్డులు వేసుకోవడం, స్టోర్‌లోనే అన్ని విషయాలు మాట్లాడటంతో పాటు పూర్తి ప్రాసెస్‌ను చేయడంతో పూర్తిగా నమ్మాల్సి వచ్చిందని తెలిపారు.
వస్తువులు ఇవ్వలే, డబ్బులు రాలే.. : బాధితులు
వస్తువులు కొనుగోలు చేస్తే.. ఆ డబ్బులు వెంటనే ఇస్తామని, ‘జీరో’ వడ్డీతో కట్టుకోవచ్చని నమ్మించడంతో దాదాపు రూ.3లక్షల వస్తువులు కొనుగోలు చేసినట్టు కొందరు బాధితులు తెలిపారు. నగరంలోని నాలుగైదు రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్స్‌లో ఇలాంటి వ్యవహారం కొనసాగుతుందని, చైతన్యపురి, సరూర్‌నగర్‌ తదితర పోలీస్‌స్టేషన్లలో సైతం కేసులు నమోదయ్యాయని తెలిపారు. డబ్బులు అడిగితే.. ఏం చేసుకుంటారో చేసుకోండని సాగర్‌, జ్యోతి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు వస్తువులు ఇవ్వలేదని, డబ్బులు రాలేవని, ఈఎంఐలు మాత్రం కట్టాలంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులే తమకు న్యాయం చేయాలని కోరారు.
కేసు నమోదు చేశాం: ఉప్పల్‌ సీఐ
కొందరు బాధితులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారని ఉప్పల్‌ సీఐ ఎలక్షన్‌ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ వ్యవహారంలో ఒక్కరిద్దరి ప్రమేయమే ఉందా లేక మరికొంత మంది ఉద్యోగుల ప్రమేయం ఉందా అనేది తేలాల్సి ఉందన్నారు. ఎవరికైనా కష్టపడందే డబ్బులు రావని, అత్యాశకు పోయి మోసపోవద్దని సూచించారు.