బంగ్లాదేశ్‌కు ఊరట

– ఆఖరి పోరులో హర్మన్‌సేనపై గెలుపు
– 2-1తో టీ20 సిరీస్‌ భారత్‌ వశం
మీర్పూర్‌ (బంగ్లాదేశ్‌) : బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను టీమ్‌ ఇండియా సొంతం చేసుకుంది. 2-1తో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్‌కౌర్‌ సేన మరో పొట్టి సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక నామమాత్రపు మూడో టీ20లో బంగ్లాదేశ్‌ ఊరట విజయం సాధించి వైట్‌వాష్‌ ప్రమాదం నుంచి బయటపడింది. గురువారం మీర్పూర్‌లో జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత అమ్మాయిలు 20 ఓవర్లలో 9 వికెట్లకు 102 పరుగులు సాధించారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (40, 41 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి స్లో పిచ్‌పై విలువైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. జెమీమా రొడ్రిగస్‌ (28, 26 బంతుల్లో 4 ఫోర్లు) సిరీస్‌లో తొలిసారి మెరిసింది. షెఫాలీ వర్మ (11), యస్టికా భాటియా (12), స్మృతీ మంధాన (1) విఫలమయ్యారు. సవాల్‌తో కూడిన 103 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ మహిళలు 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఛేదనలో ఓపెనింగ్‌ బ్యాటర్‌ షమినా సుల్తానా (42, 46 బంతుల్లో 3 ఫోర్లు) ముందుండి నడిపించింది. రాణి (10), నిగర్‌ సుల్తానా (14), సుల్తానా (12), నహిద అక్తర్‌ (10 నాటౌట్‌) షమినా సుల్తానాకు మరో ఎండ్‌ నుంచి సహకారం అందించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ షమినా సుల్తానా మెరుపులతో బంగ్లాదేశ్‌ 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఊరట విజయం సాధించింది. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు అందుకుంది. భారత్‌, బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌ ఆదివారం మీర్పూర్‌లోనే ఆరంభం కానుంది.