తెలంగాణ ఇన్‌సర్వీస్‌ వైద్యులకు సుప్రీంకోర్టులో ఊరట

– మంత్రి దామోదర రాజనర్సింహకు ధన్యవాదాలు : తెలంగాణ పీజీ ఇన్‌సర్వీస్‌ వైద్యులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ స్థానికత కలిగి గతంలో తెలంగాణ రాష్ట్రం బయట ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఇన్‌సర్వీస్‌ వైద్యులకు పీజీ వైద్య విద్య అడ్మిషన్లలో అవకాశం దక్కేలా సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు తెలంగాణ పీజీ ఇన్‌సర్వీస్‌ వైద్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు బుధవారం నాయకులు డాక్టర్‌ కత్తి జనార్థన్‌ తదితరులు ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ అభ్యర్థుల తరపున ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు. అడ్మిషన్లలో అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఊరట కలిగించిందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఇన్‌ సర్వీస్‌ వైద్యుల తరపున అడ్వొకేట్‌ శ్రీరాం వాదనలు వినిపించినట్టు తెలిపారు. తెలంగాణ స్థానికత కలిగి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ మాత్రమే తెలంగాణ బయట పూర్తి చేసి తిరిగి సొంత రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా కాంట్రాక్ట్‌ వైద్యులుగా సేవలందిస్తున్నారని తెలిపారన్నారు. దాదాపు ఆరు నుంచి 10 ఏండ్లపాటు తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్న వారికి ఇన్‌సర్వీస్‌లో పీజీ చేసే అర్హత ఉందంటూ వాదించారని చెప్పారు. వాదనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు శంకర్‌ నారాయణ, శ్రవణ్‌ కుమార్‌లకు సుప్రీంకోర్టు ఇన్‌ సర్వీస్‌ డాక్టర్లకు పీజీ అడ్మిషన్లలో అవకాశం కల్పించాలని సూచనలు చేసిందని తెలిపారు. ఇందుకు ఆ లాయర్లు కూడా సుముఖత వ్యక్తం చేసి ఒప్పుకున్నారని పేర్కొన్నారు.