– ఎన్నికలతో ప్రచార సామాగ్రి తయారీలో బిజీబిజీ
– వేలాది మందికి లభిస్తున్న ఉపాధి
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగుకు సమయం సమీపిస్తోంది. రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల సీజన్లో నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని భావిస్తున్న వస్త్ర పరిశ్రమ పెద్దలు తమ రోజువారీ కార్యకలాపాలను తాత్కాలికంగా పక్కన పెట్టి బ్యాడ్జీలు, జెండాలు, బ్యానర్ల తయారీలో నిమగమైపోయారు.
దేశంలో ఆరు వారాల పాటు సాగే సార్వత్రిక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. రాజకీయ పార్టీలన్నీ పెద్ద ఎత్తున జెండాలు, బ్యానర్ల తయారీకి అర్డర్ ఇస్తున్నాయి. డిమాండును తట్టుకోవడానికి వస్త్రాల తయారీదారులు తమ సిబ్బందితో ఎక్కువ గంటలు పనిచేయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మథుర పట్టణంలో వస్త్రాలు తయారు చేసే 40 ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో ఒక ఫ్యాక్టరీ యజమాని ముకేశ్ అగర్వాల్ మాట్లాడుతూ రాజకీయ ప్రచారంలో ఉపయోగించే చౌకైన, ఉత్తమమైన సామగ్రి జెండాలు, బ్యానర్లేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార సామగ్రి తయారీలో పెద్దగా లాభాలు ఉండవు. కానీ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. పార్టీ బ్యాడ్జీ రూపాయి ధర నుండి లభిస్తుంది.
డిమాండ్ పెరుగుతుంటే కొన్ని ఫ్యాక్టరీలు రోజుకు పది లక్షల బ్యాడ్జీలు ఉత్పత్తి చేయగలవని అగర్వాల్ తెలిపారు. ఎన్నికల సమయంలో దేశంలో ఎక్కడ చూసినా వివిధ రాజకీయ పార్టీలు, వేలాది మంది అభ్యర్థులకు చెందిన పోస్టర్లు, బ్యానర్లు దర్శనమిస్తుంటాయి. ‘మన దేశంలో చాలా మంది ప్రజలు పెద్దగా చదువుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో వివిధ పార్టీల కార్యకర్తలు ఓటర్లలో తమ గుర్తులకు ప్రాచుర్యం కల్పించేందుకు జెండాలు ఉపయోగిస్తారు. ఇళ్ల బయట వాటిని కడుతుంటారు. తమ ప్రచారంలో వాటిని మాధ్యమంగా వాడుకుంటారు’ అని అగర్వాల్ వివరించారు.
ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లోని సూరత్ వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా విలసిల్లుతోంది. ఇక్కడ ఎన్నికల సామగ్రి పెద్ద ఎత్తున తయారవుతుంది.
ఉత్తరాన మథుర, దక్షిణాన హైదరాబాదులో కూడా ఎన్నికల ప్రచార సామగ్రిని తయారు చేస్తున్నారు. ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి. రాజకీయ పార్టీలు వస్తువులు, సేవలపై డబ్బు ఖర్చు చేస్తుంటాయి. హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటాయి. ఎన్నికల సామగ్రిపై రాజకీయ పార్టీలు రూ. మూడువేల కోట్ల నుంచి ఐదువేల కోట్ల వరకూ ఖర్చు చేస్తాయని, ఆ సమయంలో కోటి మందికి ఉపాధి లభిస్తుందని పాత ఢిల్లీలోని సదర్ బజార్ మార్కెట్కు చెందిన వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి గుల్షన్ ఖురానా చెప్పారు. ఆయన యాభై సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారు.
2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు వ్యాపారం 30 శాతం పెరగవచ్చునని ఆయన అంచనా వేశారు. మూడోసారి అధికారంలోకి రావడానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తోంది. భారీ స్థాయిలో ప్రచార సామగ్రిని సిద్ధం చేస్తోంది. ఆ స్థాయిలో కాకపోయినా ప్రతిపక్షాలు కూడా ప్రచార సామగ్రికి ఆర్డర్ ఇస్తున్నాయి. ఈ పరిణామాలు వస్త్ర పరిశ్రమకు కలిసొస్తున్నాయి.