మహత్తర పోరాటానికి మతం రంగు – బీజేపీ వికృత విన్యాసం

Religion is the color of Mahattha's struggle - BJP's perverse maneuverదేశంలో మతద్వేషాన్ని రెచ్చగొట్టి, శవాల దిబ్బలమీద నడుచుకొంటూ ఢిల్లీ పీఠమెక్కిన బీజేపీ తన అధికారాన్ని నిలుపుకొనేందుకు సందర్భం వచ్చినప్పుడల్లా హిందూ,ముస్లింల మధ్య విభజన విద్వేషాన్ని సృష్టిస్తూనే ఉంది. పశువధ సాకుతో హత్యాకాండ, హిజాబ్‌ పేరుతో వివాదం, లవ్‌ జిహాద్‌ అంటూ ఒక అపోహ. మణిపూర్‌లో జాతి విద్వేషాలు, కనీవినీ ఎరుగని రీతిలో, సంఖ్యలో హత్యలు, మానవహక్కుల హననం. ముస్లింల భవనాలను పనిగట్టుకొని కూల్చే బుల్డోజర్‌ బాబా దుర్మార్గం. యూనిఫాం సివిల్‌ కోడ్‌, ముస్లిం జనాభా శాతం పెరిగిపోతుందన్న పుకార్లు. ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్‌లు ముస్లిం ద్వేషులన్నట్లు ముద్ర వేయడం, వినాయకచవితి ఉత్సవాలని మతద్వేషానికి ఉపయోగించడం, అభ్యుదయానికి ఆటంకంగా నిలిచే సనాతనధర్మాన్ని ప్రశ్నించే వారి కండ్లు పీకేస్తామనే ప్రలాపాలు. ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏకంగా కేంద్రమంత్రి వర్గ సమావేశంలో చర్చించడం, విమర్శకులపైకి ఒంటికాలితో లేవమని ప్రధాని స్వయంగా తమ మంత్రులకు పిలుపునివ్వడం వగైరాలన్నీ మతం పేరుతో మెజారిటీ ప్రజలను బుట్టలో వేసుకోనే ఎత్తుగడలే. ఆ కోవలోనిదే నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన మహత్తర సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులిమే వికృత విన్యాసం కూడా.
నిజాం ఫ్యూడల్‌ పాలనకు, దొరల భూస్వామ్య పీడనకు వ్యతిరేకంగా ఐదేండ్ల పాటు అంకుఠిత త్యాగాలతో దీక్షా సాహసాలతో సాగింది సాయుధ పోరాటం. భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటం. హైదరాబాద్‌లో సింహాసనం మీద కూర్చున్నది నిజాం ముస్లిమే కావచ్చు. కాని ఆయన పాలనను నిలబెట్టింది దొరలు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, పటేల్‌ పట్వారీలే! వారంతా మెజారిటిగా హిందువులే. నిజాంతో పాటు వారు రైతులను, కూలీలను, వృత్తిదార్లను, చిన్న వ్యాపారులను నిర్దయంగా దోచుకొని పీల్చిపిప్పి చేసిన వారే. వారికి నిజాం మద్దతు ఇచ్చాడు. వారు నిజాంను మోశారు. ఆనాటి దోపిడీ, పీడనల నుండి బయటపడేందుకు ప్రజలు తమ స్థాయిల్లో చేసిన ఆ పోరాటాలను ఎక్కడికక్కడ అణిచి వేసేందుకు పూనుకొన్నది హిందూ జమీందార్లు, భూస్వాములే. ఆ దొరలను ఏనాడు పలెత్తు మాట ఆనని వారికి వారసులే నేటి ఈ బీజేపీ-ఆరెస్సెస్‌ నేతలు. ఆనాటి వాస్తవాలను కప్పిపుచ్చి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం వ్యతిరేక పోరాటంగా చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. దొరలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని కించపర్చుతూ కొన్నాళ్ల క్రితం కాషాయ పార్టీ నాయకుడు ప్రకాశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ఆ పూర్వ రంగం నుండి వచ్చిందే.
నిజాం పాలనను ముస్లిం పాలనగా చిత్రీకరించడంలోనే పెద్ద అబద్ధం దాగి ఉంది. ఆ మాటకొస్తే మధ్య యుగాల్లోనూ, ఆ తర్వాత కూడా పాలకుడు ముస్లిం అయినా హిందువు అయినా తన మతం వారిపై మాత్రమే ఆధారపడి పాలన చేయలేదు. తమ మతానికి చెందిన రైతులను, కూలీలను వారు దోపిడీ నుండి మినహాయించిందీ లేదు.గ్రామాల్లోని రైతులకు, కూలీలకు ఇతర గ్రామీణ జనానికి అక్కడి దొరనే నిజాం. అసమానతలు, అవమానాలకు ఆస్తులు కులం, ప్రాతిపదిక కావచ్చు గానీ మతం ఎప్పుడూ ప్రాతిపదికకాదు. ఏదొర, ఏ నవాబు, ఏ రాజు సహ మతస్తుల మానవ హక్కులను కూడా గౌరవించ లేదు.
హైదరాబాద్‌ను పాలించిన అసఫ్‌ జాహీలు (నిజాములు) వారికి ముందు కుతుబ్‌ షాహీలు మతం చేత ముస్లింలైనంత మాత్రాన పాలనలో హిందువులు భాగం కాకుండా పోలేదు. కుతుబ్‌షాహిల్లో అత్యంత ప్రముఖుడైన కులీ కుతుబ్‌ షా భాగమతి అనే హిందూ స్త్రీని పెండ్లాడాడు. అంటే ‘లవ్‌ జిహాద్‌’ చేశాడన్న మాట. వారు చివరి దాకా కలిసే జీవించారు. దాయాదుల వల్ల తన ప్రాణానికి ప్రమాదం ఎదురైనప్పుడు ఆయన పూర్వీకుడు ఇబ్రహీం విజయనగరం వెళ్లి హిందూ రాజు ఆశ్రయం పొందాడు. అదునుజూసి విజయనగరం రాజు సహాయంతో గొల్కొండ కోటలోకి దూసుకొచ్చి సింహాసనాన్ని ఆక్రమించాడు. కుతుబ్‌షాహిల్లో చివరివాడయిన అబ్దుల్లా (తానాషా) ఆస్థానంలో హిందువులైన అక్కన్న మాదన్నలు ఉన్నత పదవుల్లో ఉంటూ రాజ్యపాలనలో కీలక పాత్రలు పోషించారు. కుతుబ్‌ షాహీలు ముస్లింలే అయినా మొఘల్‌ చక్రవర్తులు షాజహాన్‌, ఆ తర్వాత ఔరంగజేబు గొల్కొండ రాజ్యం కబళించడానికి యుద్ధం చేయకుండా ఊరుకోలేదు. మొదట షాజహాన్‌ తన కుమారుడైన ఔరంగజేబు నాయకత్వం కింద సైనాన్ని పంపి గొల్కొండ స్వాధీనానికి విఫల ప్రయత్నం చేశాడు. తాను చక్రవర్తి అయ్యాక ఔరంగజేబు స్వయంగా భారీ సెన్యంతో వచ్చి నెలరోజులకు పైగా యుద్ధం సాగించి చివరికి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొన్నాడు. ఆ యుద్ధంలో అక్కన్న మాదన్నలు తమ ప్రాణాలర్పించారు.
6వ నిజాం మీర్‌ అక్బర్‌ అలీ ఖాన్‌ సికందర్‌ ఝా దగ్గర హిందువైన చందులాల్‌, దివాన్‌గా పనిచేశాడు. నిజాం ఇంగ్లీషు వారి అడుగులకు మడుగు లొత్తుతున్నాడని రొహిల్లా ముస్లింలు 1857లో తిరగబడ్డారు. మౌల్వీ అల్లా ఉద్దీన్‌, తుర్రెబాజ్‌ ఖాన్‌ నాయకత్వంలో హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ ప్రతినిధి అధికార నివాసం రెసిడెన్సీ (ప్రస్తుతం కోఠీ, ఉమెన్స్‌ కళాశాల) మీద దాడి చేశారు. కాని బ్రిటిష్‌ నిజాం సైన్యాల దాటికి రోహిల్లాలు నిల్వలేకపోయారు. నిజాం సైన్యాలు నాయకులిద్దరిని అరెస్టు చేశాయి. తుర్రెబాజ్‌ ఖాన్‌ పారిపోబోయి నిజాం సైన్యం చేతుల్లో చనిపోయాడని చెప్తారు. మౌల్వీ అల్లా ఉద్దీన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించి అండమాన్‌ జైలుకు పంపారు. 1857 సిపాయిల తిరుగుబాటులో హిందూ ముస్లిం సైనికులు రాజులు, నవాబు కలిసి ఇంగ్లీషు పాలకుల మీద తిరగబడ్డారు. హైదరాబాద్‌లో ముస్లింలే బ్రిటిష్‌ మీద, ముస్లిం నిజాం మీద తిరుగుబాటు చేశారు.
నిజాం పాలనను నిలబెట్టడంలో హిందువులు అందించిన తోడ్పాటుకు మరో ఉదాహరణ 6వ నిజాం మహబూబ్‌ అలీ ఖాన్‌ తన ప్రధానిగా రాజా కిషన్‌ ప్రసాద్‌ను నియమించుకోవడం. ఆయన అంతకు పూర్వం నిజాం సంస్థానంలోనే పని చేసిన చందులాల్‌ మనువడికి మనవడు. చందులాల్‌ పూర్వీకుడు తోడర్‌ మల్‌. అతను చక్రవర్తి అక్బర్‌ దగ్గర రెవెన్యూ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించాడు. అక్బర్‌ సామ్రాజ్యంలో మరో ముఖ్యమైన వ్యక్తి రాజా మాన్‌ సింగ్‌. అక్బర్‌ భార్య జోధాబాయికి సోదరుడు. అక్బర్‌ సేనాపతిగా ఆయన అనేక రాజులను ఓడించి అక్బర్‌ సామ్రాజాన్ని విస్తరించారు. ఆయన లాగే ఎందరో హిందూ సేనానులు అక్బర్‌ సైన్యంలో పని చేశారు.
నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో ముస్లిం పాత్రికేయులు కూడా ఉన్నారు. సోవియట్‌ యూనియన్‌ స్ఫూర్తితో ముస్లిం పాత్రికేయులు ఉత్తర భారతదేశం నుండి వచ్చి ఇక్కడ ఊర్దూ పత్రికలు నెలకొల్పారు. బ్రిటిష్‌ పాలకులకు నిజాం ఇచ్చే మద్దతుపై, నిజాం విధానాలపై ప్రశ్నలు లేవనెత్తేవారు. 1891లో నిజాంకు వ్యతిరేకంగా ఏదీ రాయరాదని, ఆ మేరకు ఒక హామీ పత్రం రాసివ్వాలని సంపాదకులకు తాఖీదులు జారీ అయ్యాయి. షౌకతుల్‌ ఇస్లాం అనే సంపాదకుడు దానికి నిరాకరించాడు. ఫలితంగా ఆయన పత్రిక మూతబడింది. మరికొన్ని ఊర్దూ పత్రికలకు, దక్కన్‌ స్టాండర్డ్‌ అనే ఇంగ్లీషు పత్రికకూ అదే గతి పట్టింది. అంటే ఇప్పుడు ”గోదీ” మీడియా చేస్తున్న పనిచేయడానికి ముస్లిం సంపాదకులు కూడా ఆనాడు నిరాకరించారన్నమాట. రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీకి నిజాం మద్దతునివ్వడం చూసి ఎందరో ఉన్నత పదవుల్లోని ముస్లింలు పదవుల నుండి తప్పుకొన్నారు.
ఖాజీ మహ్మద్‌ అబ్దుల్‌ గఫార్‌ ఉత్తరప్రదేశ్‌ నుండి వచ్చి ‘పయ్యాం’ అనే పత్రికను స్థాపించాడు. నిజాం పాలనను ఆ పత్రిక వ్యతిరేకించేది. రజాకార్లకు వ్యతిరేకంగా చాలామంది ముస్లిం రిటైర్డ్‌ అధికార్లు చేసిన ప్రకటనను ఆయన తన పత్రికలో ప్రచురించారు. ఆ పత్రిక పాఠకులకు చేరేలోగా ఆయన రాజ్యం సరిహద్దులు దాటి ప్రాణాలు కాపాడుకొన్నాడు. ఆ పత్రిక మూతబడింది. రజాకార్ల ఆగడాలను ఎండగట్టి వారి చేతుల్లో బలైన సాహసోపేత జర్నలిస్టు షోయబ్‌-ఉల్లా-ఖాన్‌ గురించి మనకు తెలుసు. నిజాం వ్యతిరేక పోరాటంలో భాగంగా ఏర్పడిన హైదరాబాదు కామ్రేడ్స్‌ అసోషియేషన్‌లో మగ్దూం మొహియుద్దీన్‌, ప్రొ.ఆలం కుంద్‌మిరి, జావేద్‌ రజ్వీ లాంటి ముస్లింలున్నారు.
తమ రాబడి పెంచుకోవాడానికి ముస్లిం నవాబులు పరిసరాల్లోని ఇతర ముస్లిం సవాబులను ఓడించి ఆ రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకొన్నారు. హిందూ రాజులూ అదే పనిచేశారు. చత్రపతి శివాజీ కూడా ఎందరో హిందూ రాజులను దుర్గాధిపతులను జయించి తన సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆయన దగ్గర ఎంతో ముస్లింలు విశ్వాసపాత్రులైన అంగరక్షకులుగా, సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. ఔరంగజేబు పంపిన అఫ్జల్‌ ఖాన్‌ దగ్గరికి సంధి ఆహ్వానంపై శివాజీ వెళ్తుండగా తగిన ఆయుధాలు లేకుండా వెళ్లవద్దని శివాజీని కట్టడి చేసిన అంగరక్షకుడు ముస్లిమే. అతను ఊహించినట్లుగానే భారీకాయుడైన అఫ్జల్‌ఖాన్‌ అలింగనం సాకుతో శివాజీని ఊపిరాడకుండా చేసి చంపాలని ప్రయత్నించాడు. పదునైన ఇనుప గోళ్లను దుస్తుల్లో దాచుకొని వెళ్లిన శివాజీ ఆ గోళ్లతో అఫ్జల్‌ ఖాన్‌ను చీల్చి చంపేశాడు.
ఔరంగజేబు తరపున ఒక హిందూ రాజు శివాజీపై దండెత్తి వచ్చాడు. శివాజీని ఓడించాలంటే చండియాగం చేయాలని అతనికి బ్రాహ్మణులు సలహా ఇచ్చారు. ఆ రోజుల్లోనే రూ. రెండు లక్షలు ఆయన యాగం కోసం కేటాయించాడు. శివాజీ హిందువే అయినా బ్రాహ్మణులు శివాజీ మరణం కోసం యాగం చేశారు. శివాజీని ఔరంగజేబు అగ్రాకోటలో ఖైదు చేసినప్పుడు ఆయన అంగరక్షకుడైన మదార్‌ సాబ్‌ అనే ముస్లిం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి శివాజీని ఖైదు నుండి తప్పించాడు. ఒక దశలో బీజాపూర్‌ (ప్రస్తుతం విజాపుర) రాజు ఆదిల్‌ షా దగ్గర పని చేసే వేయిమంది ముస్లిం పఠాన్ల సైన్యం ఆదిల్‌ షాను వదలి శివాజీ సైన్యంలో చేరారు. ఆ కాలంలో మతం ప్రాతిపదికగా పరిపాలన జరగలేదు కనుక అందులో విచిత్రం ఏమీలేదు. రాజా మహారాణా ప్రతాప్‌ దగ్గర కూడా ముస్లిం సేనాపతులు ఉండేవారు. వారు మొఘల్‌ సైన్యాలతో పోరాడి ప్రాణాలర్పించారు.
రాజు ఏ మతం వాడు అన్న దానితో ప్రజలకు నిమిత్తం లేదు. రాజు ఏ మతం వాడైనా వారికి ఒక్కటే. వారికి ఆ ఊరి దొరే నిజాం, ఆయన చెప్పిందే శాసనం. రాజు మారినా ఊళ్లో ఉండే దొరలు, పటేల్‌, పట్వారీలు మారరు. వారి దోపిడీ, పీడనలూ ఆగవు. రాజులు, నవాబులకేమో వారు పంపే శిస్తులు ముఖ్యంగానీ, ప్రజల బాగోగులు పట్టవు. కనుక ”ఏ రాయి అయితేనేం పళ్లూడ కొట్టుకోవడానికి” అని ప్రజలు భావించే వారు. హైదరా బాద్‌లో నిజాం ఉన్నా గ్రామాల్లోని పీడకుల్లో హిందువులే ఎక్కువ. ఆ పీడనకు వ్యతిరేకంగా సాగిన పోరాటానికి ముస్లిం వ్యతిరేక పోరాటంగా చిత్రించడమంటే పరమత ద్వేషం నూరిపోయడమే.
సెల్‌:9989718311
ఎస్‌. వినయకుమార్‌