– కులం, మతం పేరుతో వచ్చే వారిని జనం నమ్మరు
– సంజయ్ కనీసం గుడి, బడి కూడా తేలేదు
– పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుకనవుతా..
– కరీంనగర్‌కు ఎంపీగా స్మార్ట్‌సిటీని సాధించా
– రైల్వేలైన్లు, జాతీయ రహదారులు తీసుకొచ్చా..
– అభివృద్ధి కాంక్ష, తెలంగాణ బాగోగుల గురించే పరితపించేవాన్ని
– ఏ కేసులూ ప్రభావితం చేయబోవు
– కరీంనగర్ ట్రైయాంగిల్ పోటీలో విజయం పక్కా నాదే..
‘నవతెలంగాణతో’ బీఆర్‌ఎస్ కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్
దేశంలో నెల వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికల పోరు జరగనుంది. ప్రస్తుతం ఆ ఎన్నికల సమర సన్నాహాల్లో మునిగిన రాజకీయ పార్టీలన్నీ గెలుపోటములపై సర్వేలు చేసుకుంటూ క్యాడర్‌తో సమావేశాలు.. జనంలో ప్రచారానికి దిగాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు కీలక స్థానంగా ఉన్న కరీంనగర్‌పైనే అందరి దృష్టి ఉందనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి స్థానం నుంచి బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచీ కేసీఆర్ వెన్నంటి ఉంటూ వస్తున్న బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ మరోమారు రంగంలోకి దిగారు. తెలంగాణ సాధన మొదలు.. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించడమేగాకుండా గతంలో ఎంపీగా కరీంనగర్‌కు తెచ్చిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేయబోయే పనులూ వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మత రాజకీయాలు చెల్లవన్నారు. కులం, మతం పేరుతో వచ్చే వారిని జనం నమ్మే పరిస్థితి లేదని చెబుతున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన దశలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తామా? అన్న అనుమానాల నుంచి ఖచ్చితంగా గెలుస్తామనే ధైర్యం వచ్చిందంటూ చెబుతున్న కరీంనగర్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌తో ‘నవతెలంగాణ’ ముఖాముఖి.
నవతెలంగాణ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ప్రస్తుతం ఈడీ కేసులు, ఫోన్‌ట్యాపింగ్ వంటి ప్రతికూల అంశాలు మీ గెలుపును ప్రభావితం చేసే అవకాశం ఉందా?
వినోద్‌కుమార్ : రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన వారం, పది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తామా? అంటూ పార్టీ క్యాడర్ నుంచే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో గెలుపోటములు, సయయానుకూలంగా మారే రాజకీయ పరిస్థితులను క్యాడర్‌కు వివరించాను. సరిగ్గా మూన్నెళ్ల తరువాత ఆ క్యాడరే ఇప్పుడు మనం గెలుస్తున్నాం అన్నా! అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ హామీలకు మోసపోయామనే భావన ప్రజల్లో పెరిగింది. ప్రధానంగా రైతాంగమంతా రాష్ట్ర ప్రభుత్వంపై భగ్గుమంటోంది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఉద్దెర గ్యారంటీలనేది తేలిపోయింది. అదే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారనడానికి తార్కాణంగా చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం కవితపై కేసులు, అరెస్టులు, ఫోన్‌ట్యాపింగ్ వంటి రాజకీయ క్రీడను సాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మా నాయకత్వంపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని త్వరలోనే తేలుతుంది.
మీరు నాన్‌లోకల్ అనే అంశంపై మీ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారానికి ఎలా స్పందిస్తారు?
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. నేను నాన్‌లోకల్ అని ఆరోపిస్తున్న వారికి ఒకటే సమాధానం. నేను పుట్టింది కరీంనగర్‌లోనే. నా తల్లిగారి ఊరూ ఇక్కడే. 2004లో హన్మకొండ ఎంపీగా నేను పని చేసిన సమయంలో.. అప్పుడు వరంగల్ నుంచి కరీంనగర్ సిటీని ఆనుకుని ఉన్న మానకొండూర్ వరకూ తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉండేవి. నాన్‌లోకల్ అంటూ మాట్లాడుతున్న రెండు జాతీయపార్టీల అధినేతలు రాహుల్‌గాంధీ, మోడీ తమ రాష్ట్రాలను వదిలి వేరే రాష్ట్రాల్లో పోటీ చేసిన విషయం ప్రజలకు తెలియంది కాదు. నన్ను రాజకీయంగా, ప్రజల్లో తనపై ఉన్న ఆదరణను ఎదుర్కోలేకనే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు.
గతంలో ఎంపీగా మీరు చేసిన అభివృద్ధి పనులు ఏంటి..?
స్మార్ట్‌సిటీ హోదాకు 10లక్షల జనాభా ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ.. కేవలం 3లక్షల జనాభానే ఉన్న కరీంనగర్‌కు అప్పటి సీఎం కేసీఆర్ సహకారంతో తీసుకొచ్చిన. సుమారు రూ.వెయ్యికోట్ల స్మార్ట్‌సిటీ ప్రాజెక్టును సాధిస్తే.. ఇప్పుడు ఆ ఫలాలు ప్రజలు అందుకుంటున్నదీ తెలిసిందే. కొత్తపల్లి – మనోహరాబాద్ ప్రాజెక్టును రైల్వేశాఖ పక్కన పెడితే రాష్ట్ర సర్కారుతో కావాల్సిన భూమి సేకరించి, వ్యయంలో సగం భరించేలా ఒప్పించాను. ఆ కృషే రైల్వే లైను పట్టాలెక్కేలా చేసింది. 2014 కంటే ముందు కరీంనగర్‌లో ఒక్క జాతీయ రహదారి లేదు. విషయం పార్లమెంట్‌లో లేవనెత్తడమేగాకుండా సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖతో కొట్లాడి ఎల్కతుర్తి, హుస్నాబాద్ టూ సిద్దిపేట, మెదక్ వరకు 133కిలో మీటర్ల ఎన్‌హెచ్765డీజీ, జగిత్యాల-కరీంనగర్-వరంగల్ వరకు 216కిలోమీటర్ల ఎన్‌హెచ్-563 జాతీయ రహదారులు తీసుకొచ్చాను. కేంద్రం నుంచి రూ.3400కోట్లు మంజూరు చేయించాను. రామగుండం వయా కరీంనగర్ టూ హైదరాబాద్‌గా ఉన్న రాష్ట్ర రహదారిని సైతం ఎక్స్‌ప్రెస్ హైవేగా మార్చాలని లోక్‌సభలో గళమెత్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంపీగా, తరువాత ఐదేండ్లు రాష్ట్ర ప్లానింగ్‌బోర్డ్ వైస్‌చైర్మెన్‌గా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో విద్య, వైద్యం, క్రీడలు, ఇరిగేషన్ వంటి రంగాల్లో అనేక అభివృద్ధి పనులు చేయించాను.
మీ ప్రచార అస్త్రాలు ఏమిటి?
కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. పైగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఉచిత పథకాలన్నీ ఉద్దెర పథకాలని తేలిపోయింది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత ఎంపీ బండి సంజరు.. కనీసం గుడి, బడి కూడా తేలేని అసమర్థ ఎంపీగా మిగిలిపోయారు. ఇప్పుడు కులం, మతం పేరుతో మళ్లీ రాజకీయం చేస్తామంటే ప్రజలు ఛీత్కరిస్తారు. 2019 ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు, అప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడనే సానుభూతే సంజరు గెలుపునకు కారణమయ్యాయి. అభివృద్ధి ఎజెండా, ప్రజల ఆకాంక్షలేంటనే సోయి కూడా లేని సంజరు ఐదేండ్ల తన పదవీకాలంలో చేసిందేమీ లేక, లోకల్, నాన్‌లోకల్ అనే అంశాన్ని ఎత్తుకున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మన ప్రాంతానికి ఎవరు అభివృద్ధి చేశారు? ఎవరు పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుకగా నిలుస్తారనే స్పష్టత ప్రజల్లో ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నిజం రాబోయే ఎన్నికల ఫలితాల్లోనే తేలిపోతుంది.
బండోజు శ్రీకాంత్,
కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి, నవతెలంగాణ